కరోనాపై యుద్ధం కోసం దక్షిణాసియా దేశాలు ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ఒక్కటవ్వాలని ప్రతిపాదించింది భారత్. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) దేశాల ఆరోగ్య శాఖ అధికారుల వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ఈ మేరకు సభ్య దేశాల అభిప్రాయం కోరింది.
"కరోనాపై పోరాటానికి సార్క్ దేశాలకు ఓ ఉమ్మడి ఆన్లైన్ వేదిక ఉండాలని భారత్ తరఫున ప్రతిపాదిస్తున్నాం. దీనిద్వారా సమాచార మార్పిడి, నిపుణుల సూచనలు, వైరస్‌పై పోరాడేందుకు మెరుగైన విధానాలపై దేశాల మధ్య అవగాహన పెరిగేందుకు వీలవుతుంది."
-విదేశాంగ శాఖ ప్రకటన
అయితే ఈ ఉమ్మడి ఆన్లైన్ వేదిక ఏర్పాటుకు కావలసిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా కరోనాపై తీసుకోవాల్సిన చర్యలు, వైరస్‌పై పోరాటానికి ఇంటర్నెట్ ద్వారా శిక్షణ వంటివి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్లాట్‌ఫాం ఏర్పాటయ్యే లోగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ-మెయిల్, వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మార్చి 15న జరిగిన దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌లో సార్క్ దేశాల ఆరోగ్య శాఖల ప్రతినిధులు వైరస్‌పై చర్చించాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రధాని ఆకాంక్ష మేరకు నేడు సభ్యదేశాలైన భారత్, అఫ్గానిస్థాన్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక ఆరోగ్యశాఖల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలోనే కరోనాపై పోరుకు ఉమ్మడి ఆన్లైన్ వేదిక ఏర్పాటుకు భారత్ ప్రతిపాదన చేసింది.
ఇదీ చూడండి:కష్టకాలంలో వైద్యుల పోరాటంపై రాష్ట్రపతి ప్రశంసలు