కరోనాపై పోరులో కేంద్రం సరైన వ్యూహాలతో ముందుకు సాగుతుందని తెలిపారు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి డా.హర్ష వర్ధన్. వైరస్‌ను కట్టడి చేయటంలో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. పరీక్షల సంఖ్య పెరగడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఈటీవీ భారత్‌తో ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వైద్యసిబ్బందికి పీపీఈ కిట్ల కొరత లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అందరం కష్టకాలంలో ఉన్నాం. భారత్‌లో పరిస్థితి గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. పరిస్థితి అదుపులో ఉందని మీ ప్రభుత్వం నమ్మకంగా ఉందా?
ప్రపంచం మొత్తానికి ఇది క్లిష్ట సమయం. వైద్యరంగంలో ఇలాంటి పరిస్థితిని గత నాలుగైదు దశాబ్దాల్లో నేనెప్పుడూ చూడలేదు. చైనాలో వైరస్ వ్యాప్తి గురించి తెలిసిన తర్వాత భారత్ మొదటగా స్పందించింది. జనవరి 7న కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా సమాచారం అందించింది. 24 గంటల్లోనే నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశాం. 10 నుంచి 14 రోజుల్లో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేశాం. జనవరి 18 నుంచి చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేశాం. గత మూడు నెలల్లో వైరస్ వ్యాప్తిని పసిగట్టేందుకు చురుగ్గా స్పందించాం. సరిహద్దు ప్రాంతాల్లో 20 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించాం. 10 లక్షల మంది కదలికలపై నిఘా పెట్టాం. జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం.
ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. అన్ని దేశాలు మనవైపే చూస్తున్నాయి. మరణాల రేటు ఇక్కడే తక్కువ. కేసుల రెట్టింపు సయయం 11నుంచి 12 రోజులుగా ఉంది. 30 శాతం మంది బాధితులు కోలుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే పరీక్ష కేంద్రాల సంఖ్య 450కిపైగా పెరిగింది. వ్యూహం పరంగా, విజయంపరంగా చాలా స్పష్టతతో ఉన్నాం.
హద్దులు, అవధులు లేకుండా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పరీక్ష కేంద్రాలు పెరిగినందు వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందా?
కేసుల సంఖ్యలో గణనీయమైన పెరగుదల ఏమీ లేదు. గ్రాఫ్ నిలకడగానే ఉంది. గత 24 గంటల్లోనే 85,000మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. మొదట్లో రోజుకు 2,000 నమూనాలే పరీక్షించే వాళ్లం. కరోనా ప్రభావం లేని జిల్లాల్లో ఎస్ఏఏర్ఐ, ఇన్‌ఫ్లూయెంజా ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నాం. రాష్ట్రాలు కూడా చక్కగా సహకరిస్తున్నాయి.
గత మూడు నెలల్లో దేశంలో 50వేల నుంచి 60వేల కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. అక్కడ లక్షల సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి. భారత్‌లో మరణాల రేటు 3 శాతమే. ప్రపంచ సగటు 7నుంచి 7.5 శాతంగా ఉంది. కేసులను త్వరగా గుర్తించడం, టెస్టుల సంఖ్య పెరగడం వల్ల కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. సమాజంలో ఉన్న ప్రతి పాజిటివ్ కేసును గుర్తించడమే మా లక్ష్యం.
పరీక్షా కేంద్రాలకు సంబంధించి కేంద్రం వ్యూహమేంటి? ఈ నెలఖారు వరకు అదనంగా ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? ప్రస్తుత వ్యూహాలు కరోనా నియంత్రణకు సరిపోతాయా?
మే రెండో వారం నాటికి దేశంలో పరీక్షా కేంద్రాలను 472కు పెంచాం. అందులో 275 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల సామర్థ్యం 95,000కు పెరిగింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిపుణుల బృందం సూచనల మేరకే వ్యూహాన్ని రూపొందించాం. ఎవరికి పరీక్షలు చేయాలనే విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తున్న గణాంకాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న గణాంకాలకు వ్యత్యాసం ఉండటానికి కారణం?
కొవిడ్ కేసుల సంఖ్యలో వ్యత్యాసానికి తావు లేదు. ఇదంతా డైనమిక్ ప్రక్రియ. అనుమానాస్పద రోగులను గుర్తించడం నుంచి ల్యాబ్‌లో పరీక్షల నివేదికల వరకు సమాచారం ఎప్పటికప్పుడే తెలిసిపోతుంది. ఈ వివరాలను తర్వాత రాష్ట్రాలకు, ఐడీఎస్పీ, ఐసీఎంఆర్‌కు పంపుతాం.
ఏఏ హాట్స్పాట్లపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తున్నారు?
దేశం మొత్తాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాం. దాదాపు 130 హాట్‌స్పాట్ జిల్లాలున్నాయి. 284 జిల్లాలను నాన్ హాట్స్పాట్లుగా గుర్తించాం. 319 జిల్లాల్లో కరోనా ప్రభావం లేదు. హాట్ స్పాట్లలో కేసుల సంఖ్య ఆధారంగా వ్యూహం ఉంటుంది. స్థానిక బృందాలు, తక్షణ స్పందన బృందాలు, నిఘా బృందాలు, వైద్య సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తారు.