రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఇందుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ వ్యవస్థలు, ఆయుధాల ఎగుమతి ప్రోత్సహించేందుకు దౌత్య మార్గాలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు స్నేహపూర్వక దేశాల ప్రతినిధులతో వర్చువల్‌గా చర్చలు జరపనున్నట్లు రక్షణ శాఖ ఉత్పత్తుల విభాగ కార్యదర్శి రాజ్ కుమార్ తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆర్మీ మేక్ ప్రాజెక్ట్స్ 2020" వెబినార్‌లో పాల్గొన్న ఆయన... ఆయా దేశాలకు ఎలాంటి ఉత్పత్తులు, రక్షణ వ్యవస్థలు అవసరమో ఈ చర్చల ద్వారా తెలుసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
"స్నేహపూర్వక దేశాలకు అవసరమయ్యే రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు, వ్యవస్థల పూర్తి జాబితాను తయారు చేస్తున్నాం. రక్షణ శాఖ నేతృత్వంలో ఆన్లైన్ వేదికగా చర్చలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎగుమతి చేసేందుకు ప్రస్తుతం మన వద్ద ఉన్న అవకాశాలను రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు(డీపీఎస్‌యూ), పరిశ్రమ గుర్తిస్తాయి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు రక్షణ రంగ సంస్థలు, రాయబార కార్యాలయాలు, దౌత్యపరమైన వ్యవస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది."