దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 28 మంది ప్రాణాలు కోల్పోగా.. 826 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 12,759కు చేరింది.
కరోనాలో 'మహా'..రాష్ట్ర
వైరస్ ప్రభావిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అక్కడ కొత్తగా 286 మందికి వైరస్ సోకగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తంగా 3,401 మంది వైరస్ బాధితులు ఉన్నారు. 187 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా చనిపోయిన వారిలో 45 శాతం, కేసుల్లో దాదాపు 24 శాతం ఈ రాష్ట్రం వారే ఉన్నారు.
ఒక్క ముంబయి మహానగరంలోనే 2,073 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆరు రోజుల్లోనే కేసులు రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి ధారావి మురికివాడ ప్రాంతంలోనే ఒకే రోజు 26 కొత్త కేసులు వచ్చాయి. పుణెలో 4,19 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. పాల్ఘర్ జిల్లాలో 20 ప్రదేశాలను వైరస్ హాట్స్పాట్లుగా గుర్తించారు. ఈ రాష్ట్రంలో మొత్తం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 295కు చేరింది.
దిల్లీలో ఆసుపత్రి సిబ్బంది నిర్బంధం..
దిల్లీలోని ఓ ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సులు సహా 68 మంది వైద్య సిబ్బందిని స్వీయ నిర్బంధానికి పంపించారు. ఓ గర్భిణీ మహిళ కరోనాతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. మొత్తంగా దిల్లీలో 1,652 మంది వైరస్ బారిన పడ్డారు. 32 మంది మరణించారు.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో కొత్తగా 361మందికి వైరస్ పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 1,299కి చేరింది. గత 24 గంటల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ మరణాల సంఖ్య 63కు పెరిగింది. మొత్తం 52 జిల్లాలు ఉండగా.. 26 జిల్లాల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన ఇండోర్‌లో 47 మంది వైరస్‌కు బలయ్యారు.
బిహార్‌లో రెండేళ్ల చిన్నారికి..
బిహార్‌లో ఓ రెండేళ్ల చిన్నారి సహా కొత్తగా పదిమందికి కరోనా సోకింది. ముంగేర్ జిల్లాకు చెందిన ఆ పసిపాప ఇంట్లోని ఐదుగురు సభ్యులు వైరస్ బారినపడ్డారు. కుటుంబంలోని వృద్ధుడికి కొవిడ్-19 ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలో మొత్తంగా 80 కేసులు నమోదవగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశాలో విస్తృత పరీక్షలు..
ఒడిశాలో పెద్ద ఎత్తున కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే ఎనిమిది నుంచి పది రోజుల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. మొత్తంగా ఒడిశాలో 60 కేసులు నమోదవగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
కశ్మీర్లో 58 వేల మందిపై పర్యవేక్షణ..