తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత భూభాగం దురాక్రమణ ఎవరి తరమూ కాదు'

దేశంలోని అంగుళం భూమిని కూడా ప్రపంచంలోని ఏ శక్తి కదలించలేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. భారత్​పై దురాక్రమణకు దిగితే ఎవరికైనా దీటుగా బదులిస్తామని పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న రాజ్​నాథ్.. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ సరిహద్దులు శత్రు దుర్భేద్యంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

India not a weak country, no power in the world can touch even an inch of its land:Rajnath in Ladakh
'అంగుళం భూమిని కూడా ముట్టుకోలేరు- దురాక్రమణకు దిగితే అంతే'

By

Published : Jul 17, 2020, 4:40 PM IST

దేశ గౌరవంపై దాడిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్ స్పష్టం చేశారు. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న లద్దాఖ్​లో పర్యటించారు​. త్రిదళాధిపతి బిపిన్​ రావత్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవణేతో కలిసి సరిహద్దులో పరిస్థితిపై సమీక్షించారు.

లేహ్​లో సైనిక స్థావరం
రాజ్​నాథ్​ ప్రసంగం సమయంలో సైనికులు

గల్వాన్​ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు రాజ్​నాథ్​ సింగ్ నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. సరిహద్దు వివాదం పరిష్కారంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే అవి ఎంతమేరకు పరిష్కారం చూపిస్తాయనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. గల్వాన్​లో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు రాజ్​నాథ్​ పరోక్షంగా హెచ్చరికలు పంపారు.

"భారత్​ బలహీన దేశం కాదు. ప్రపంచంలోని ఏ శక్తి భారత భూభాగంలోని ఒక్క అంగుళాన్ని కూడా తాకలేదు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. ప్రపంచానికి భారత్ శాంతి సందేశం ఇచ్చింది. భారత సార్వభౌమత్వంపై దాడి చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సైనికుల త్యాగాన్ని వృథాగా పోనివ్వం."

-రాజ్‌నాథ్‌ సింగ్, రక్షణ మంత్రి

అంతకుముందు లేహ్​లో సైనిక దళాల పారా గ్లైడింగ్​ విన్యాసాలను రాజ్​నాథ్ వీక్షించారు. సరిహద్దుల్లో సైనికులు వినియోగిస్తున్న అత్యాధునిక ఆయుధాల పనితీరును అధికారులు రక్షణ మంత్రికి వివరించారు. ఆయుధాల పనితీరును పరిశీలించిన రక్షణ మంత్రి మెషీన్​ గన్​ను ఎక్కుపెట్టారు.

తుపాకీ గురిపెట్టిన రక్షణ మంత్రి
సైనికులకు మిఠాయిలు తినిపిస్తున్న రాజ్​నాథ్

ఈ సందర్భంగా లేహ్​లో భారత సైనిక విన్యాసాలు అబ్బురపరిచాయి. సైన్యం సత్తా చాటేలా సాగిన హెలికాఫ్టర్, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

సైనికుల విన్యాసాలు వీక్షిస్తున్న మంత్రి

పాకిస్థాన్​ సరిహద్దుకు

సైనికులతో సమావేశమైన రాజ్​నాథ్​ సరిహద్దుల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో బృంద ఫొటో దిగారు. శనివారం మధ్యాహ్నం రాజ్​నాథ్​... పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు

సైన్యంతో బృంద ఫొటో

ABOUT THE AUTHOR

...view details