చైనా వైఖరితోనే తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయని భారత్ వెల్లడించింది. మే నెల ప్రారంభంలోనే యథాతథ స్థితిని మార్చాలంటూ చైనా ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. భారత్ దానికి ఒప్పుకోకపోవడం వల్ల సరిహద్దు వెంబడి బలగాల మోహరింపుతో ఉద్రిక్తతలకు తెరతీసిందని చెప్పుకొచ్చింది.
'గల్వాన్‌పై మే నెల నుంచే చైనా కుట్ర' - india china standoff
తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనకు చైనాదే బాధ్యతని భారత్ తేల్చి చెప్పింది. మే నెల ప్రారంభం నుంచే ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే సైనికుల మధ్య ఘర్షణ చెలరేగిందని స్పష్టం చేసింది.
విదేశాంగ శాఖ
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన దగ్గరి నుంచి జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. తూర్పు లద్ధాఖ్ ప్రతిష్టంభనకు చైనాదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు.
- మే ప్రారంభంలో గాల్వన్ లోయ ప్రాంతంలో భారతదేశం సాధారణ, సాంప్రదాయ గస్తీని అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. మే రెండో వారంలో పశ్చిమ సెక్టార్‌లోని కొన్ని ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చాలని కోరింది.
- చైనా చర్యలకు దౌత్య, సైనిక మార్గాల్లో నిరసన తెలిపాం. ఇలాంటి మార్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాం.
- ఈ నేపథ్యంలోనే జూన్ 6న లెఫ్టినెంట్ జనరళ్ల మధ్య భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా అధికారులు అంగీకారం తెలిపారు. వాస్తవాధీన రేఖను గౌరవించి, కట్టుబడి ఉండాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేదు.
- ఈ క్రమంలో చైనా తొలుత వెనక్కు తగ్గినప్పటికీ మళ్లీ కొన్ని నిర్మాణాలు చేపట్టింది. దీనిపై జూన్ 15న ప్రశ్నించగా చైనా బలగాల చర్యలు హింసాత్మక ఘర్షణలకు దారి తీశాయి. ప్రత్యక్ష ప్రాణనష్టానికి కారణమయ్యాయి.
- అనంతరం రెండువైపులా భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. మరోవైపు సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరుగుతున్నాయి.
Last Updated : Jun 25, 2020, 8:18 PM IST