కరోనా సామూహిక వ్యాప్తిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ కే శ్రీనాథ్ రెడ్డి సూచించారు. లాక్డౌన్ సడలించడం వల్ల మరింత వేగంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
భారత్లో ఇప్పటికే సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని నిపుణులు చేస్తోన్న వ్యాఖ్యలపై శ్రీనాథ్ స్పందించారు. ఈ విషయం 'సామూహిక వ్యాప్తి' నిర్వచనంపై ఆధారపడి ఉంటుందన్నారు. దీనిపై వాగ్వాదం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలు, వైరస్ సోకిన వ్యక్తులకు సంబంధం లేని కేసులు చాలా వరకు బయటపడ్డాయని తెలిపారు.
"కరోనా సోకిన చాలా మంది వైరస్ ఉన్న ప్రాంతాల వద్దే కేంద్రీకృతమై ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల మార్గంతో వారికి సంబంధం ఉంది. భారత్లో కరోనా స్టేజీ-2లో ఉందని వాదిస్తున్న వారు... సామూహికవ్యాప్తి ప్రారంభం కాలేదనే భావిస్తున్నారు. ఇది గుర్తించదగిన స్థానిక వ్యాప్తి మాత్రమే అని చెబుతున్నారు."
-ప్రొఫెసర్శ్రీనాథ్రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
అయితే వైరస్ వ్యాపించిన దాదాపు అన్ని దేశాల్లో సామూహిక వ్యాప్తి సంభవించిందని శ్రీనాథ్ గుర్తు చేశారు. అందువల్ల భారత్ సైతం అందుకు సిద్ధంగా ఉండి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదుపులోనే మరణాలు
దక్షిణాసియా దేశాల్లో భారత్, మలేసియా మాత్రమే కొవిడ్ మరణాల రేటును నియంత్రించగలిగాయని శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. యువ జనాభాతో పాటు ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే ఉండటం వంటి అంశాలు భారత్లో మరణాలు పరిమితంగానే ఉండటానికి ఉపకరించాయన్నారు. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, వైరస్ కట్టడి చేయడానికి అవలంభించిన విధానాలు ఇందుకు దోహదం చేశాయన్నారు.