భారత్లో కొవిడ్-19 కేసులు ఎక్కువవుతుంటే.. తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో విషయం కలవరపెడుతోంది. లాక్డౌన్ వల్ల కేసుల విజృంభణ తగ్గినా.. వర్షాకాలంలో రెండో దశ కేసులు నమోదవుతాయని చెప్పారు. జులై లేదా ఆగస్టులో ఈ పరిస్థితి ఎదురవుతుందని ప్రభుత్వాలను హెచ్చరించారు.
కచ్చితంగా పాటించాల్సిందే..
ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతను పాటించడంపైనే... వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు శివ నాడార్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇస్తే.. మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం చైనాలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని ఉదహరించారు.
కోలుకున్నవారికి మరింత ముప్పు!
తొలిదశ కరోనా వచ్చి కోలుకున్నవారికి రెండో దశ వైరస్ వ్యాప్తి చెందితే.. ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు పరిశోధకులు. ప్రస్తుతం చైనా, ఐరోపా దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. బాధితుల్లో తగినంత వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే ఇందుకు కారణమని వివరించారు.
ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్, సామాజిక దూరం, మాస్కులు ధరించడం వల్ల భారత్ వైరస్ నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్నారు పరిశోధకులు.
లాక్డౌన్ సమయంలోనే టెస్టులు, ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేట్ను వేగవంతం చేయాలని... వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వర్షాకాలంలో భారత్లో ఫ్లూ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడే టెస్టుల సంఖ్యను పెంచి, హాట్స్పాట్లలో బాధితులను గుర్తించి, సత్వరమే తగిన చికిత్స అందించాలని సూచించారు.
ఇదీ చదవండి:'వేసవిలో భారత్ కరోనాను జయించొచ్చు!'