పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్‌లో అదృశ్యమైన ఇద్దరు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అక్కడి పోలీసులు వీరిని అరెస్టు చేశారని వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. దిల్లీలోని పాక్ దౌత్య అధికారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే వీరిని పాక్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ అధికారులు సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. హైకమిషన్ కార్యాలయం నుంచి వాహనంలో బయల్దేరిన వారు గమ్యస్థానాన్ని చేరుకోలేదు. అయితే వీరిని 'హిట్ అండ్ రన్' కేసులో పాక్ అధికారులు అరెస్టు చేశారని ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి.
వారికేమైనా జరిగితే..
అరెస్టయిన ఇద్దరు భారత అధికారులను విచారించవద్దని, వాళ్లను హింసించడానికి వీల్లేదని పాక్ దౌత్య అధికారికి జారీ చేసిన డీమార్చిలో పేర్కొంది భారత్. వారి భద్రతకు పాక్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అరెస్టయిన ఇద్దరు అధికారులను కారుతో సహా భారత హైకమిషన్ కార్యాలయంలో తక్షణమే అప్పగించాలని పాక్ దౌత్య అధికారికి భారత్ తేల్చి చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.