దేశంలో పేదరికం స్థాయి తగ్గుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2006-16 మధ్య కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఓ నివేదికలో తెలిపింది.
ప్రపంచ బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ)-2019 జాబితాను 'ఐరాస అభివృద్ధి కార్యక్రమం', 'ద ఆక్స్ఫర్డ్ పేదరికం, మానవాభివృద్ధి సంస్థ' సంయుక్తంగా విడుదల చేశాయి.
101 దేశాల్లో సర్వే చేసిన ఈ సంస్థలు.. ఆదాయంతోపాటు ఆరోగ్యం, ఉద్యోగ పరిస్థితులు, హింస తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. 31 తక్కువ, 68 మధ్య, 2 ఉన్నత ఆదాయ దేశాలు న్నాయని నివేదిక వెల్లడించింది. 130 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారని తెలిపింది. ఇందులో అధికం భాగం పిల్లలేనని నివేదిక స్పష్టం చేసింది.
పది దేశాల్లో తగ్గుదల
భారత్తో పాటు మొత్తం పది దేశాల్లో పేదరికం తగ్గింది. బంగ్లాదేశ్, కంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతీ, నైజీరియా, పాకిస్థాన్, పెరూ, వియత్నాం తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో దక్షిణాసియా దేశాలే అధికం.