రహస్య గూఢచర్యం, సమాచార భాగస్వామ్య నెట్వర్క్ 'ఫైవ్-ఐస్'లో చేరింది భారత్. అంతర్జాతీయ సైబర్ భద్రత, సహకారం, వ్యక్తిగత గోప్యత విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ సరైన నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై జపాన్‌తోనూ చేతులు కలిపింది భారత్. ఫలితంగా వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్ మొదలైన వాటిలో ఎన్‌క్రిప్ట్ చేసిన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిసి 1941లో 'ఫైవ్ ఐస్'ను స్థాపించాయి. దౌత్య, భద్రత, సైనిక, ఆర్థిక రంగాల్లో ప్రయోజనాల కోసం ఇతర దేశాల సమాచారాన్ని పొందేందుకు దీన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ క్లబ్లో భారత్ చేరటం కీలక పరిణామంకానుంది.
ఈ సందర్భంగా టెక్ కంపెనీలకు ఫైవ్-ఐస్ దేశాల ప్రతినిధులతో పాటు భారత్, జపాన్.. కీలక ప్రతిపాదనలు చేశాయి. ఈ సంయుక్త ప్రకటనలో 'ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్' ద్వారా ఎదురయ్యే ముఖ్యమైన సవాళ్లను ప్రస్తావించాయి. పరికరాలు, అప్లికేషన్లు, ఇతర ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్స్ వంటి గోప్యత సేవలకు సంబంధించి తమ స్పష్టమైన వైఖరిని చెప్పాయి.
"కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడం కీలకమైన అంశమే. గోప్యత, సైబర్ భద్రతను తప్పనిసరిగా కాపాడాలి. అయితే ఇది ఆన్లైన్ ద్వారా చట్ట విరుద్ధమైన సమాచారం, కార్యాచరణకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. టెక్ పరిశ్రమపై బలవంతపు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడకూడదు. గోప్యతకు సంబంధించిన ప్రోగ్రాముల్లో బ్యాక్‌డోర్ ద్వారా చట్టపరమైన సంస్థలకు సమాచారం పొందే విధంగా రూపొందించాలి."
-- భారత్-జపాన్ సంయుక్త ప్రకటన