అత్యాధునిక 5జీ, కృత్రిమ మేధ సాంకేతికతలలో సహకారానికి సంబంధించి భారత్, జపాన్ మధ్య ఒప్పందం ఖరారైంది. వీటితోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
"డిజిటల్ సాంకేతికత ప్రాముఖ్యాన్ని గుర్తించి భారత్, జపాన్ విదేశాంగ మంత్రులు.. సైబర్ సెక్యూరిటీ ఒప్పందాన్ని అంగీకరించారు. సంక్లిష్ట సమాచార వ్యవస్థ, 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ, తదితర అంశాల్లో సామర్థ్యం పెంపు, పరిశోధన, అభివృద్ధి, భద్రత వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారం ఈ ఒప్పందంతో మరింత పెరుగుతుంది."
- భారత విదేశాంగ శాఖ
ఐపీఓఐలో భాగస్వామిగా..
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అనంతరం జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిషు మోతెగి ఓ ప్రకటన చేశారు. ఇండో పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమాలు(ఐపీఓఐ)లో కనెక్టివిటీ పిల్లర్‌లో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఐపీఓఐ అనేది భారత్ ఆధారిత ఫ్రేమ్‌వర్క్. చైనా దుందుడుకు చర్యలు పెరిగిపోతున్న ఇండో-పసిఫిక్‌లో సురక్షిత, భద్రతతో కూడిన సముద్ర విధానాలను రూపొందించే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.