నమస్తే ట్రంప్: అధ్యక్షుడి రాక కోసం యావత్ దేశం ఎదురుచూపు ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ రెండురోజుల భారత పర్యటన మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జరేడ్ కుష్నేర్‌తో పాటు శ్వేతసౌధం ప్రతినిధుల బృందంతో కలిసి ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు.
రోడ్ షోలో మోదీ-ట్రంప్
అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్‌కు ఘన స్వాగతం పలుకుతారు ప్రధాని నరేంద్రమోదీ . అక్కడి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోటేరా వరకు ఇద్దరూ రోడ్ షోలో పాల్గొంటారు. సుమారు 22 కిలోమీటర్ల మేర సాగే ఈ రోడ్ షోలో ఇరువురు అగ్రనేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు.
ఈ రోడ్ షో మహాద్భుత దృశ్యాన్ని సాక్షాత్కరింపజేయనుంది. అఖండ భారతావని ఔనత్యంతో పాటు సంస్కృతి సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రోడ్‌షో దృష్ట్యా అహ్మదాబాద్ నగరమంతటా ట్రంప్-మోదీ స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మార్గమధ్యలో మహాత్ముడి సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ సందర్శిస్తారు.
రోడ్ షో ముగిసిన తర్వాత మోటేరా మైదానాన్ని ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభిస్తారు. స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనుంది. బాలీవుడ్ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్‌తో పాటు ప్రముఖ కళాకారులు వినోదం పంచనున్నారు. అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ భారత పర్యటనకు వస్తున్న ట్రంప్...ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేయనున్నారు.
అల్పాహారం జాబితాలో 'ఖమన్'
సబర్మతి ఆశ్రమం సందర్శన సందర్భంగా ట్రంప్ అక్కడ అల్పాహారం తీసుకోనున్నారు. గుజరాత్ ప్రసిద్ధ వంటకమైన ఖమన్తో పాటు బ్రకోలి సమోసా, మొక్కజొన్న సమోసా, ఆపిల్ పై, కాజూ కట్లీ సిద్ధం చేస్తున్నారు.
తాజ్‌మహల్ సందర్శన
మోటేరాలో కార్యక్రమం అనంతరం ట్రంప్ కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రా వెళ్లి తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. ఆగ్రాలో ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్. ఆగ్రా రోడ్లపై భారీ హోర్డింగ్‌లు, భారత్, అమెరికా జెండాలను ఏర్పాటు చేశారు.
ఉదయం 11:30 వరకే టిక్కెట్లు..
ట్రంప్ సందర్శన నేపథ్యంలో తాజ్‌మహల్‌కు వచ్చే పర్యాటకులకు ఈరోజు ఉదయం 11:30 గంటల తర్వాత టిక్కెట్లను నిలిపి వేయనున్నారు. భద్రతా కారణాల దృష్యా ట్రంప్ సందర్శన పూర్తయ్యే వరకు ఇతరులకు అనుమతి ఉండదు. అధికారుల సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం 5:15 గంటలకు తాజ్‌మహల్ చేరుకుంటారు ట్రంప్. అరగంట పాటు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
రాత్రికి దిల్లీ...
ఆగ్రా నుంచి రాత్రికి దిల్లీ చేరుకొని ఐటీసీ మౌర్యలో బస చేయనున్నారు ట్రంప్. రేపు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పిస్తారు. తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జరిగే సంప్రదాయ స్వాగత కార్యక్రమానికి సతీసమేతంగా హాజరై త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరిస్తారు. అనంతరం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం ట్రంప్ గౌరవార్థం.. ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రేపు సాయంత్రం అమెరికా రాయబార కార్యాలయం సందర్శించి, వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. రేపు రాత్రి ట్రంప్‌కు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. అనంతరం భారత్ నుంచి జర్మనీ వెళ్తారు అగ్రరాజ్యం అధ్యక్షుడు.
ఎంతో ఉత్సాహం..
భారత పర్యటనకు బయలుదేరేముందు అమెరికాలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పర్యటన పట్ల ఎంతో ఉత్సుకతతో ఉన్నానని వెల్లడించారు. నరేంద్రమోదీ వంటి గొప్ప స్నేహితులని కలవబోతున్నట్లు చెప్పారు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు భారత్ ఎదురుచూస్తోందని మోదీ అన్నారు.
ఏఏ ఒప్పందాలు..
ఈ పర్యటన సందర్భంగా భారత్-అమెరికా మధ్య ప్రధానంగా రెండు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
- రూ. 16,200 కోట్లు విలువ చేసే 24 ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు.
- రూ. 5,600 కోట్లు విలువ చేసే ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు.
పటిష్ట భద్రత
ట్రంప్ భారత పర్యటన దృష్ట్యా..అహ్మదాబాద్, ఆగ్రా, దిల్లీలో అసమాన భద్రతా ఏర్పాట్లు చేశారు. అహ్మదాబాద్‌లో రోడ్ షోను దృష్టిలో పెట్టుకొని అమెరికా భద్రతా దళాలతోపాటు భారత్‌కు చెందిన 10వేల మందికిపైగా పోలీసు బలగాలను మోహరించారు. 25 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షించనుండగా... ఉగ్రవాద నిరోధక దళం, యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించడం సహా ఎన్ఎస్జీ కమాండోలను రంగంలోకి దించారు.