నిద్ర.. ఎన్నో సమస్యలకు మూల కారణం. ఓ వ్యక్తి అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఇది ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరిగా నిద్రలేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. నేడు 'వరల్డ్ స్లీప్ డే' సందర్భంగా నిద్రపై ఓ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు పరిశోధకులు.
ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో అతి తక్కువ సమయం నిద్రపోతారట. భారత్లోని 10 నగరాల్లో ఈ సర్వే జరిపి నిద్రపోయే సమయాలను గుర్తించారు. సాధారణంగా మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అయితే ఎవరూ సరిపడ నిద్రపోవడం లేదని వెల్లడించింది ఈ సర్వే.
25-35 ఏళ్ల వయసున్న మహిళలు వారాంతాల్లో 6 గంటల 36 నిమిషాలు నిద్ర పోతారు. మిగతా రోజుల్లో సుమారు 6:57 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. పురుషులు అయితే వారాంతాల్లో 6:33 నిమిషాలు, మిగతా రోజుల్లో 6:45 నిమిషాలు నిద్రపోతారు.
నిద్రలో వాళ్లే ఎక్కువ...
సాధారణంగా సంపన్నులు అధికంగా విశ్రాంతి తీసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ అందులో వాస్తవం లేదు. వారు వారాంతాల్లోనూ, మిగతా రోజుల్లోనూ సుమారు 6:45 నిమిషాలే నిద్రిస్తారు. ఇక మధ్యతరగతి వారైతే వారాంతాల్లో 7:27నిమిషాలు, మిగతా రోజుల్లో 6:51 నిమిషాలు పడుకుంటారు.