భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడటానికి సరిహద్దులో జవాన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. వారికి మద్దతుగా నిలుస్తామని నేతలు లోక్‌సభలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వాస్తవాధీన రేఖను చైనా గుర్తించలేకపోతోందని తెలిపిన రాజ్‌నాథ్.. ఫలితంగా సరిహద్దు సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నారు.
"భారత్-చైనా సరిహద్దు సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇప్పటివరకు ఇరు పక్షాలు ఓ పరిష్కారంపై పరస్పర అంగీకారానికి రాలేదు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సంప్రదాయ అమరికలను చైనా గుర్తించడం లేదు. కానీ వాస్తవాధీన రేఖను భారత్ గౌరవిస్తోంది. భౌగోళికంగా అన్ని సూత్రాలను పాటించిన తర్వాతే దాన్ని ఏర్పాటు చేసినట్టు మేము విశ్వసిస్తున్నాం. అయితే సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత్-చైనా అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాం."
--- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి.
ప్రస్తుత ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాజ్‌నాథ్. సరిహద్దులో యథాతథ స్థితిని చైనా ఏకపక్ష ధోరణితో మార్చేందుకు ప్రయత్నిస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. బీజింగ్‌కు ఈ విషయాన్ని ఇప్పటికే దౌత్య మార్గాల ద్వారా తేల్చిచెప్పినట్టు స్పష్టం చేశారు.