వాస్తవాధీన రేఖకు అటూ ఇటూ వెయ్యి మంది చొప్పున సైనికులు మోహరించి ఉన్నారు. ఇరు పక్షాల మధ్య కొద్ది మీటర్ల దూరమే ఉంది. గతవారం రెండు దేశాల బలగాల నడుమ భీకర ఘర్షణ జరిగిన తర్వాత గల్వాన్ లోయలో నెలకొన్న పరిస్థితి ఇది. ఈ నేపథ్యంలో హద్దు మీరుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సైనికపరంగా ఉన్న మార్గాల గురించి భారత్ తీవ్రంగా యోచిస్తోంది. గల్వాన్‌లోని పెట్రోలింగ్ పాయింగ్ (పీపీ)-14 వద్ద రెండు దేశాలూ తమ బలప్రదర్శనకు దిగాయి. పాంగాంగ్ సరస్సు వద్ద కూడా ఇరు పక్షాలూ పోటాపోటీగా సైన్యాన్ని మోహరిస్తున్నాయి. వీటికి మద్దతుగా కొద్దిదూరంలో శతఘ్ని దళాలు, ట్యాంకులనూ రంగంలోకి దించాయి. జూన్ 15 తర్వాత కొత్తగా హింస జరగలేదు. అయితే భారీ బలగాల మోహరింపు వల్ల పరిస్థితి వేడిగా ఉంది. రెండు పక్షాలకూ పరస్పరం నమ్మకం సడలిందని అధికార వర్గాలు తెలిపాయి.
సైనిక ఆపరేషన్?
చైనా దుందుడుకుతనం కొనసాగితే సైనికపరంగా బదులిచ్చేందుకు పలు మార్గాలను భారత్ పరిశీలిస్తోంది.
- పాంగాంగ్ సరస్సు వద్ద డ్రాగన్ బలగాలను వెనక్కి పంపేయడానికి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టే అంశంపై భారత్ యోచిస్తోంది. ఇటీవలి వరకూ భారత నియంత్రణలో ఉన్న 'ఫింగర్ 4' వద్ద చైనా బలగాలు తిష్ఠవేశాయి.
- వాస్తవాధీన రేఖ వెంబడి మరో ప్రాంతంలోనూ మోహరింపును చేపట్టే అంశాన్నీ భారత్ పరిశీలించొచ్చు. తద్వారా డ్రాగన్‌పై ఒత్తిడి పెరిగి, రాజీకి వస్తుందని, లద్దాఖ్ అంశంపై జరిగే చర్చల్లో ఇది భారత్‌కు సానుకూల పరిస్థితిని కలిగిస్తుందని భావిస్తోంది.