అణ్వాయుధ దేశాలపై వాటి వినియోగానికి చివరి ప్రాధాన్యం, అణ్వాయుధయేతర దేశాలపై అసలు వినియోగించకపోవటం అనే విధానాన్ని భారత్ సమర్థిస్తుందన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. అణ్వాయుధ నిర్మూలన, విస్తరణను అడ్డుకునే అంతర్జాతీయ ప్రయత్నాలను బలోపేతం చేయటంలో భారత్ కీలక భాగస్వామి అని పేర్కొన్నారు.
అణ్వాయుధాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ష్రింగ్లా.
"ప్రపంచంలోనే ఏకైక బహుపాక్షిక అణు నిరాయుధీకరణ చర్చలకు భారత్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. పూర్తిస్థాయిలో అణ్వాయుధాలను నిర్మూలించాలనే నిబద్ధతకు భారత్ కట్టుబడి ఉంటుంది. అంతర్జాతీయ అంగీకారం మేరకు దశల వారీగా అణ్వాయుధ నిర్మూలన సాధించవచ్చనేది భారత్ నమ్ముతుంది. అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య నమ్మకం పెంచేందుకు సరైన చర్చలు అసవరం. అణ్వాయుధాలను వినియోగించటం అనేది ఐరాస నిబంధనలు ఉల్లంఘించటం సహా మానవత్వానికి వ్యతిరేకంగా నేరం చేయటమే."