పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి, పర్యావరణ హిత అభివృద్ధే ప్రధాన సూత్రాలుగా వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ కృషి చేస్తోందని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోదీ. భూతాపం తగ్గించే విషయంలో పారిస్ ఒప్పందానికి లోబడి పనిచేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు.
గుజరాత్ గాంధీనగర్లో జరుగుతున్న వలస జాతుల సంరక్షణ సదస్సును ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు మోదీ. మధ్య ఆసియా ఫ్లైవే వెంట వలస పక్షుల సంరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.