హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో డ్రోన్లు, ఐటీ సేవల ఎగుమతి సహా.. యుద్ధ నౌకల నిర్వహణ, మరమ్మతు వంటి సేవలు అందించేందుకు భారత్‌కు మంచి అవకాశం ఉందన్నారు నౌకాదళ అధినేత అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్. పెట్రోలింగ్ నౌకల నిర్మాణం కోసం భారత పరిశ్రమ, ప్రధానంగా ఐఓఆర్‌లోని దేశాలతో భాగస్వామ్యానికి అవకాశాలను అన్వేషించవచ్చని సూచించారు.
రక్షణ శాఖలోని సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన భారత్‌శక్తి.ఇన్ పోర్టల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సదస్సులో ప్రసంగించారు సింగ్.
"యుద్ధ నౌకలకు తరుచుగా నిర్వహణ, మరమ్మతులు అవసరం. దాని కోసం సొంత పోర్టుకు తిరిగి రావలసి వస్తే చాలా సమయంతో పాటు డబ్బు అవసరం. ఐఓఆర్‌లో 40 దేశాలకు చెందిన 70 వరకు యుద్ధ నౌకలు తిరుగుతున్నాయి. కొన్ని నౌకలు తమ సొంత దేశానికి చాలా దూరంలో ఉంటున్నాయి. భారత్‌కు ఇది మంచి అవకాశం. ఐఓఆర్‌లో భారత్‌కు చాలా షిప్‌యార్డులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలి, యుద్ధనౌకల మరమ్మతు సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా విస్తరించాలనేదే ఇక్కడ ప్రశ్న. ఐఓఆర్‌లోని ఇతర దేశాల యుద్ధ నౌకలకు భారత్ రిఫిట్స్, డ్రై డాకింగ్, రవాణా, నిర్వహణలో సహాయం, క్లిష్టమైన పరికరాల మరమ్మతులను అందించగలదు."