భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వార్థ ప్రయోజనాలు కోసం భారత్ ఎవరితోనూ యుద్ధం చేయదని స్పష్టం చేశారు. రిషికేశ్‌లోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైన పర్మాత్ నికేతన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపన్యాసించారు అజిత్. ఈ నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక చరిత్ర, స్వామి వివేకానంద ఫిలాసఫీని గుర్తు చేసుకున్నారు.
'స్వార్థపూరిత కారణాల వల్ల భారత్ ఎవరితోనూ యుద్ధం చేయలేదు. దేశ రక్షణకు ముప్పు వాటిల్లినప్పడే రంగంలోకి దిగుతుంది' అని ఓ ఔత్సాహికుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు డోభాల్. ఈ నేపథ్యంలో భారతీయ నాగరికత శాంతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఆధ్యాత్మిక గురువులను కోరారు. సామూహిక గుర్తింపును కాపాడటమే భారతీయ గురువులు, ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర అని అన్నారు.