ఇతర దేశాల రాజకీయాలపై భారత్ నిష్పక్షపాత వైఖరి అవలంబిస్తుందని స్పష్టంచేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. హ్యూస్టన్ 'హౌడీ మోదీ' సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన 'అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్' నినాదంపై వివరణ ఇచ్చారు విదేశాంగ మంత్రి. అమెరికాలోని భారతీయ సంఘాలకు దగ్గరవ్వడానికి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఈ నినాదాన్ని ఉపయోగించారని.. తాజాగా దానినే మోదీ గుర్తుచేశారని జైశంకర్ చెప్పారు.
ప్రస్తుతం మూడు రోజల అమెరికా పర్యటనలో ఉన్నారు జైశంకర్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ తరఫున మోదీ ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు.
"మోదీ అన్న వ్యాఖ్యలను సరిగ్గా పరిశీలించండి. ట్రంప్ ఉపయోగించిన నినాదాన్నే మోదీ గుర్తుచేశారు. ప్రధాని వ్యాఖ్యలను అపార్థం చేసుకోకూడదు. ఆయన మాటలపై మోదీకి స్పష్టత ఉంది. అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడే భారతీయులకు దగ్గరవ్వడానికి ట్రంప్ ఈ నినాదం చేశారని మోదీ అన్నారు. దీనిపై ఎలాంటి దుష్ప్రచారం చేయకూడదు."
--- జైశంకర్, విదేశాంగ మంత్రి.