ఆసియాలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో 30 శాతం, మరణాల్లో 20 శాతం భారత్లోనే నమోదవుతున్నాయని భారత ప్రజారోగ్య సంఘం (ఐపీహెచ్ఏ) నిపుణులు వెల్లడించారు.
'భారత్లో కొవిడ్-19'పై మూడో సంయుక్త ప్రకటన చేసింది ఐపీహెచ్ఏ టాస్క్ఫోర్స్ బృందం. అయితే, దేశంలో కరోనా సంక్షోభం తారస్థాయికి చేరుకోలేదని తెలిపింది. దేశంలో ఆగస్టు 16 నాటికి కరోనా నుంచి 23 లక్షల (ప్రస్తుతం 28 లక్షలు) మంది కోలుకున్నారని, మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోందని వివరించింది.
"దేశంలో ఆగస్టు 16 నాటికి 7 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. పునరుత్పత్తి రేటు 1.06గా ఉంది. అంటే, దేశంలో కరోనా విపత్తు తారస్థాయికి చేరుకోలేదు. అయితే, కరోనా మహమ్మారి ప్రతిస్పందనకు పూర్తి ఆరోగ్య వ్యవస్థను వినియోగించటం వల్ల ఇతర జాతీయ వైద్య కార్యక్రమాలపై పరిమితమైన దృష్టి సారించారు."
- టాస్క్ఫోర్స్ నివేదిక
దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. చాలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి మొదలైనట్లు సెరో సర్వేలు బయటపెట్టినట్లు వివరించింది. వీటి ప్రకారం.. అంచనా వేసిన కేసుల్లో 5 శాతమే గుర్తించగలుగుతున్నామని తెలిపింది.