నల్లధనం వెలికితీత దిశగా ముందడుగు వేసింది భారత్. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నగదు దాచిన భారతీయ కుబేరుల వివరాల తొలి జాబితాను ఆ దేశం నుంచి కేంద్రం అందుకుంది. స్విస్తో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు స్వయంచాలిత సమాచార మార్పిడి వ్యవస్థ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తొలి జాబితా దిల్లీ చేరింది.
స్విస్ బ్యాంకుల్లో.. నల్లధనం దాచుకున్న వారి వివరాలను ఆటోమెటిక్ విధానంలో భారత్ సహా 75 దేశాలు స్విట్జర్లాండ్ సమాఖ్య పన్ను విభాగం ద్వారా పొందుతున్నాయి. ఈ విధానంలో అక్కడి బ్యాంకుల్లో నగదు దాచుకున్న వారి వివరాలను భారత్ అందుకోవడం ఇదే తొలిసారి.
జాబితాలోని కొన్ని ఖాతాలు ఇంకా కొనసాగుతుండగా 2018లో మూసేసినవి కూడా ఉన్నాయని తెలుస్తోంది. తదుపరి ఖాతాల సమాచారం 2020 సెప్టెంబరులో భారత ప్రభుత్వానికి స్విస్ సర్కార్ పంపనుంది.