కర్తార్‌పుర్ నడవా నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్. నడవా నిర్మాణపనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలను రవీశ్ ఖండించారు. పంజాబ్ గురుదాస్‌పుర్ నుంచి పాకిస్థాన్ కర్తార్‌పుర్‌కు నేరుగా రాకపోకలు సాగించేందుకు వీలుపడే ఈ నడవాను సకాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. నాలుగు వరుసల రహదారితో పాటు ప్రయాణ ప్రాంగణాన్ని త్వరగా నిర్మిస్తామన్నారు. రెండు ప్రాజెక్టుల పనులకు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.
"భారత్ కర్తార్‌పుర్ నడవా నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలనుకుంటున్నాం."
- రవీశ్‌కుమార్, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి