రైతుల పత్తి విత్తన ఎంపికలో ప్రకటనల ప్రభావమే పూర్తిగా ఉంటోందని అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రూ ఫ్లాచ్స్ అనే పరిశోధకుడు తెలంగాణలో చేసిన సర్వే అమెరికన్ ఆంత్రోపాలజీ అనే జర్నల్లో ప్రచురితమైంది.
పత్తి ఉత్పత్తికితెలంగాణప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో చిన్న రైతులే దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడే 90వ దశకంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. జన్యుమార్పిడి విత్తనాలతో వీటిని నివారించవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
ఎంత మంది ఏ విత్తనాలను ఎంచుకుంటున్నారో తెలుసుకోవటానికి ఫ్లాచ్స్ 2012 నుంచి 2018 మధ్య గ్రామాల్లో నివసిస్తూ సర్వే చేశారు. జన్యుమార్పిడి విత్తనాలతో రైతుల అనుభాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సంస్థల సలహాలు రైతులకు అందుబాటులో లేకపోవటం వల్ల వారికి తోచిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారని సర్వే తెలిపింది.
2008లో తెలంగాణలో చాలా మంది రైతులు ఒకే రకానికి చెందిన విత్తనాలను వేశారు. అందులో కొన్ని అయితే సాగైన భూమిలో సగం వరకు ఉన్నాయి. తరువాతి సంవత్సరంలో మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో కొత్త విత్తనానికి మారారు.
సర్వే సమయంలో అత్యంత ప్రజా ప్రాముఖ్యం ఉన్న ఆరు విత్తనాల దిగుబడి సాధారణ స్థాయిలోనే ఉంది. వాతావరణం, నీరు, చీడపురుగుల లాంటి కారణాల వల్ల పూర్తి దిగుబడి సామర్థ్యాన్ని అందుకోలేకపోతున్నారు రైతులు.