కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని వల్ల కరోనా కేసులను పెరగకుండా చూడవచ్చని భావించింది. నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తూ జూన్ మొదటి వారం నాటికి అనేక మినహాయింపులు ఇస్తూ వచ్చింది. జూన్ 8వ తేదీతో చాలా నిబంధనలను సడలించేశారు. ఫలితం రెండు వారాల్లో కొత్తగా 1.55లక్షల కేసులు నమోదయ్యాయి. జూన్ నెల ప్రారంభమయ్యే సమయానికి దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.76లక్షలుగా ఉంది. అయితే, జూన్ 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.32లక్షలకు చేరింది. అంటే కేవలం 15రోజుల్లో 1,55,772 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన టాప్-10 దేశాల జాబితాలో భారత్ వచ్చి చేరింది.
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న కేసులు
జూన్ ముందు వరకూ వరకూ వివిధ రాష్ట్రాలు, నగరాల్లో కరోనా కేసుల నమోదు తీవ్రత తక్కువగా ఉండేది. అయితే, జూన్ మొదటి వారం నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఒక్క జూన్‌లోనే మహారాష్ట్రలో 42వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య లక్షను దాటేసింది. ఇక తమిళనాడులోనూ కేసుల సంఖ్య రెట్టింపు అయింది. మే 31వ తేదీ నాటికి 21,184 కేసులు నమోదు కాగా, పక్షం రోజుల్లో ఆ సంఖ్య 44,661కి చేరింది. అంటే దాదాపు 110శాతం పెరుగుదల ఉంది. ఇక దేశ రాజధాని పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కేవలం రెండు వారాల్లో 22,633 కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క జూన్ నెలలోనే కొత్తగా 88వేల కేసులు నమోదు కావడం గమనార్హం.
ఎనిమిదో స్థానం నుంచి..
మే 31వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉంది. కేవలం 15రోజుల్లో నాలుగో స్థానానికి చేరిందంటే దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. మే చివరి నాటికి భారత్‌తో పోలిస్తే, రెండింతల కేసులతో రష్యా సతమతమైంది. కానీ, ఈ పదిహేను రోజుల్లో అక్కడ కేవలం 52వేల కొత్త కరోనా కేసులు నమోదవడం గమనార్హం. అదే సమయంలో యూకేలో 22వేలు మాత్రమే నమోదయ్యాయి.