దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 83,883 పాజిటివ్ కేసులు వెలుగుచూడడం దేశంలో కొవిడ్-19 తీవ్రతకు అద్దం పడుతోంది. గతంతో పోలిస్తే వైరస్ వ్యాప్తి విస్తృతమవ్వడం.. పరీక్షల సంఖ్య పెరగడం ఇందుకు కారణం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడం లేదు. ఆ సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే రీతిలో పెరిగితే కరోనా మహమ్మారి వెలుగుచూసిన చైనా మొత్తం కేసులను మన రోజువారీ కేసులు దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ దేశాల స్థాయిలో..
దేశంలో ప్రస్తుతం అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో గతంలో వందల్లో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఒకటో తేదీ నాటికి దేశంలో మొత్తం కేసులు 17లక్షలు కాగా.. చివరి నాటికి రెట్టింపు అయ్యింది. ఆగస్టు మొదటి వారం నుంచి రోజూ 50వేల కేసులకు పైబడే రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి. అంటే బహ్రెయిన్ (మొత్తం కేసులు 52 వేలు), సింగపూర్ (56వేలు), పోర్చుగల్ (58 వేలు), పోలాండ్ (67వేలు), జపాన్ (69వేలు) యూఏఈ (70వేలు) దేశాల మొత్తం కేసులను ఇప్పటికే మనం దాటేశాం. ప్రస్తుతం స్వీడన్ (84వేలు), బెల్జియం (85వేలు) మొత్తం కేసులకు చేరువలో ఉన్నాం. డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వీటిని స్పష్టం చేస్తున్నాయి.
త్వరలో చైనాను..?
కరోనా వైరస్ వెలుగుచూసిన చైనాలో ప్రస్తుతం మొత్తం కేసులు సంఖ్య 90,422గా ఉంది. కొత్తగా ఆ దేశంలో ఇప్పటికీ రోజూ 10 నుంచి 20 కేసులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలో లాక్డౌన్ మొదలైనప్పటికి చైనా అన్లాక్ ప్రక్రియ చేపట్టింది. అప్పటికే దాదాపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మన దేశంలో లాక్డౌన్ చేపట్టినప్పుడు కాకుండా.. అన్లాక్ మొదలైన తర్వాత కేసుల పెరుగుదల మొదలైంది. ఈ సమయంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది.