కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్యలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో కొనసాగుతోంది భారత్. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో 18.6 శాతం భారత్లో నమోదు కాగా.. కోలుకున్నవారిలో 21 శాతం మంది ఉన్నారు.
అత్యల్ప మరణాల రేటు నమోదవుతోన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతర్జాతీయంగా కరోనా మరణాల రేటు 2.97 శాతం ఉండగా.. భారత్లో 1.56 శాతం ఉందని స్పష్టం చేసింది. ప్రతి పది లక్షల మందిలో 73 మంది మరణించారని పేర్కొంది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 130గా ఉంది.
10 రాష్ట్రాల్లోనే అధికంగా..
జాతీయ రికవరీ రేటు 83.84 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా 75 వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 54.27 లక్షలకు చేరింది. ఇందులో 74.36 శాతం రికవరీ కేసులు10 రాష్ట్రాల్లోనే నమోదైనట్లు తెలిపింది.
10 లక్షలకు దిగువన..
వరుసగా పన్నెండో రోజు దేశంలో క్రియాశీల కేసులు 10 లక్షలకు దిగువన ఉన్నాయి. ప్రస్తుతం 9.44 లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. మొత్తం కేసుల్లో ఇది 14.6 శాతంగా ఉంది. 10 రాష్ట్రాల్లోనే 77 శాతం క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:భారత్లో 'లక్ష' దాటిన కరోనా మరణాలు..