దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం దిగువకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా విషయంలో భారత్ ఉమ్మడిగా పోరాడి తగిన ఫలితాలు సాధించినట్లు పేర్కొంది. ప్రతి పది లక్షల జనాభాలో కరోనా మరణాల సంఖ్య 88 కి తగ్గిందని స్పష్టం చేసింది.
ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో కరోనా మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. దేశంలో శుక్రవారం 551 మరణాలు నమోదయ్యాయి. రోజువారీ మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని కేంద్రం తెలిపింది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యాయి.
5 రాష్ట్రాల్లోనే 65 శాతం..
దేశవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, బంగాల్లోనే 65 శాతం కేవలం నమోదయ్యాయి. మొత్తం మరణాలలో 85శాతం కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 36 శాతం మరణాలు సంభవించాయి.
6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 100 లోపే మరణాలు నమోదయ్యాయి. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 1000 లోపు మరణాలు సంభవించాయి. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 10,000 లోపు మరణాలు నమోదయ్యాయి.