జీ-20 దేశాల సదస్సు సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక కరెన్సీ నోటుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ బాహ్య ప్రాదేశిక సరిహద్దులను తప్పుగా ముద్రించటం పట్ల నిరసన తెలిపినట్లు భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది.
సౌదీ 20 రియాల్ నోటు వెనకభాగంలో ప్రపంచ పటాన్ని ముద్రించింది. ఇందులో జమ్ముకశ్మీర్, లద్దాఖ్.. భారత్లో అంతర్భాగంగా చూపించలేదు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడారు.
"మీరు ముద్రించిన నోటులో భారత ప్రాదేశిక సరిహద్దులు సరిగా లేవు. సౌదీ అరేబియా తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. భారత్లో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అంతర్భాగం. ఈ విషయంలో ఇరు దేశాల్లో ఉన్న రాయబారుల ద్వారా సౌదీకి మా ఆందోళన వ్యక్తం చేశాం."
- అనురాగ్ శ్రీవాస్తవ