తెలంగాణ

telangana

'భారత్​లో కరోనా మరణాల రేటు తక్కువే'

By

Published : Oct 13, 2020, 4:24 PM IST

అతి తక్కువగా కరోనా మరణాలు నమోదవుతున్న దేశాల సరసన భారత్ నిలిచిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరణాల సంఖ్యలో ప్రపంచంలో మిలియన్‌ జనాభాకు 138మంది చనిపోగా.. భారత్‌లో 79 మరణాలు మాత్రమే నమోదవుతున్నాయని స్పష్టం చేసింది.

VIRUS-LOWEST CASES DEATHS
భారత్​లో కరోనా మరణాల రేటు

కరోనా కట్టడి వ్యూహాలు, సమర్థమైన చర్యల వల్ల మిలియన్‌ జనాభాకు అతి తక్కువ వైరస్​ కేసులు, మరణాలు నమోదవుతున్న దేశాల సరసన భారత్‌ నిలిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. రోజుకు సగటున నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య గత 5 వారాలుగా తగ్గుతోందని తెలిపింది.

వారం వ్యవధిలో రోజూ నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య సెప్టెంబర్‌ 2న సగటున 92,830గా ఉండగా.. అక్టోబర్‌ 2న 70,114గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కేవలం 55,342 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా తీసుకుంటున్న చర్యల ఫలితమే.. కేసుల సంఖ్య క్షీణించడానికి కారణమని తెలిపింది.

కేసుల పెరుగుదలలోనూ..

ప్రపంచంలో మిలియన్‌ జనాభాకు సగటున 4,794 మంది కొవిడ్‌ బారిన పడుతుండగా.. భారత్‌లో 5,199 మందికి కరోనా సోకుతోందని ఆరోగ్యశాఖ పేర్కొంది. బ్రిటన్, రష్యా, అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో పోలిస్తే భారత్‌లోనే అతి తక్కువ మంది కరోనా బారిన పడుతున్నారని వివరించింది.

మరణాల సంఖ్యలో ప్రపంచంలో మిలియన్‌ జనాభాకు 138మంది చనిపోగా... భారత్‌లో 79 మరణాలు మాత్రమే నమోదవుతున్నాయని తెలిపింది ఆరోగ్యశాఖ. దేశంలో రికవరీ కేసుల సంఖ్య 62.27 లక్షలకు చేరగా.. వరుసగా ఐదో రోజు క్రియాశీల కేసుల సంఖ్య 9 లక్షల కన్నా తక్కువగా ఉంది.

ఇదీ చూడండి:కరోనా నుంచి కోలుకునేందుకు పట్టే సమయమెంత?

ABOUT THE AUTHOR

...view details