స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి పరీక్షను రాత్రిపూట విజయవంతంగా నిర్వహించింది డీఆర్డీఓ. భూఉపరితల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే ఈ క్షిపణిని మరోసారి రాత్రివేళ ప్రయోగించింది.
350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న పృథ్వీ-2ను ఒడిశా తీరంలో రాత్రి 7:50 గంటల మధ్య ప్రయోగించినట్లు వెల్లడించారు. పరీక్షలో.. క్షిపణి అన్ని ప్రమాణాలు అందుకుందని అధికారులు వెల్లడించారు.
శిక్షణ నిమిత్తం ఈ ప్రయోగాన్ని స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్, డీఆర్డీఓ శాస్త్రవేత్తల బృందం నిశితంగా పరీశీలించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి దిశను గుర్తించడానికి అధునాతన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఉపయోగించినట్లు చెప్పారు. క్షిపణి శకలాలను గుర్తించడానికి బంగాళాఖాతంలో పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
లిక్విడ్ ప్రొపల్షన్ ఇంధనంతో రెండు ఇంజిన్లు కలిగిన పృథ్వీ-2 క్షిపణి... 500-1000 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. లక్ష్యాలను చేధించడానికి అధునాతన ట్రాజెక్టరీ వ్యవస్థ ఉంటుంది. గత నవంబర్ 20న క్షిపణిని వరుసగా రెండు సార్లు ప్రయోగించారు.