సరిహద్దులో గత కొంతకాలంగా ఉద్రిక్తతలకు కారణమైన చైనా.. తాజాగా శాంతి మంత్రాన్ని జపిస్తున్నట్టు కనపడుతోంది. భారత్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సరైన విధానంలో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా పేర్కొంది. అనుమానాలు, ఘర్షణల వల్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరవని తెలిపింది.
తమ మధ్య ఉన్న విభేదాలను ఇరు దేశాలు సరిగ్గా అర్థం చేసుకోగలవని భారత్‌లోని చైనా రాయబారి సన్ వైయ్డాంగ్ అభిప్రాయపడ్డారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"శాంతి స్థాపనకు చైనా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. భారత్ కూడా చైనాతో కలిసి ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా. ఉద్రిక్తతలను పెంచే విధంగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టకుండా.. సరిహద్దులో పరిస్థితులు నిలకడగా ఉంచేందుకు కృషి చేయాలి. పరస్పరం గౌరవించుకుని, సహకరించుకుంటేనే దీర్ఘకాలంలో ఇరు దేశాలకు ప్రయోజనముంటుంది."
--- సన్ వైయ్డాంగ్, భారత్‌లోని చైనా రాయబారి.
'భారత్‌దే తప్పు...'
సరిహద్దులో వివాదానికి తాము జవాబుదారులం కాదని.. భారత్ వైఖరి వల్లే పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయని వైయ్డాంగ్ ఆరోపించారు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ ఘటనకు భారత్ సైన్యమే కారణమన్నారు. భారత బలగాలే.. వాస్తవాధీన రేఖను దాటి ఇరు దేశాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రవర్తించాయని తెలిపారు.
ఇదీ జరిగింది...
వాస్తవాధీన రేఖ వెంబడి గత నెల నుంచి భారత్‌పైకి కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఇదే క్రమంలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ నెల 6న ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరిగాయి. కానీ ఈ నెల 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో అనూహ్యంగా భారత సైనికులపైకి దుస్సాహసానికి పాల్పడ్డారు చైనీయులు. 20మంది భారతీయులను పొట్టనబెట్టుకున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. వేడిని చల్లార్చడానికి మరోమారు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. సరిహద్దు వెంబడి సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసహరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ఇదీ చూడండి:-చైనా దుర్నీతి- చర్చలు అంటూనే బలగాల మోహరింపు