వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట బలగాలను ఉపసంహరించుకునే విషయమై భారత్-చైనా సైనికాధికారులు మరోసారి సమావేశమయ్యారు. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు వర్గాలు సమావేశమవడం ఇది ఐదోసారి. ఎల్‌ఏసీ వెంట చైనా పరిధిలో ఉన్న మోల్డోలో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరుగుతున్న ఈ భేటీలో.. ఫింగర్ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి బలగాలను సత్వరం వెనక్కి తీసుకోవాలని గత సమావేశాల్లో భారత్, చైనా నిర్ణయించాయి. కానీ, ఇరువైపులా బలగాలు ఇంకా ఎల్‌ఏసీకి దగ్గరగానే ఉన్నాయి. బలగాల ఉపసంహరణ డ్రాగన్‌కు ఇష్టం లేదని రక్షణరంగ నిపుణులు అభిప్రాయడుతున్నారు. భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఉపసంహరణ ప్రక్రియలో జాప్యం చేస్తోందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ తరుణంలో చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్-చైనా మధ్య మరోదఫా కమాండర్ స్థాయి చర్చలు - డ్రాగన్
లద్దాఖ్ వద్ద సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా.. భారత్-చైనా మరోసారి సమావేశమయ్యాయి. కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ భేటీలో ఫింగర్ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
భారత్-చైనా మధ్య మరోదఫా చర్చలు
ఇంకా వెనక్కి వెళ్లాలి..
'ఉపసంహరణ, ఉద్రిక్తతల తగ్గింపు విధానాని'కి (డీడీపీ) ఇరు దేశాలు శ్రీకారం చుట్టాయి. ఎప్పటికప్పుడు కమాండర్ల స్థాయిలో చర్చలు జరుపుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో బలగాల్ని ఉపసంహరించుకున్నప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చైనా వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉందని ఇటీవల భారత సైన్యం తెలిపింది. వీలైనంత త్వరగా బలగాల్ని ఉపసంహరించి ప్రాంతీయంగా శాంతిస్థాపనకు సహకరించాలని డ్రాగన్‌ను కోరింది.