భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతల తాకిడికి హిమమయ లద్దాఖ్‌లో వేడి రాజుకుంటోంది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌పై పోరులో నిమగ్నమైన వేళ.. అదును చూసి ‘డ్రాగన్’ బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా వేల సంఖ్యలో సైన్యాన్ని తరలించింది. చైనాకు దీటుగా మన సైన్యం కూడా అక్కడ బలగాలను మోహరించింది. ఇప్పుడు ఇరు దేశాల సైనికులు ఢీ అంటే ఢీ అనే రీతిలో ఎదురెదురుగా నిలబడ్డారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2017 నాటి ‘డోక్లామ్ సైనిక ప్రతిష్టంభన’ తర్వాత మరో పెద్ద సైనిక వివాదం తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల కార్యదర్శితోనూ మోదీ విడిగా సమావేశమయ్యారు. త్రివిధ దళాధిపతులు ప్రత్యేకంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ భేటీ అయ్యి, తాజా పరిస్థితిని చర్చించారు.
కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్, సిక్కింలో భారత్, చైనా సైనికులు రాళ్లు, ఇనపకడ్డీలు, పిడిగుద్దులతో పరస్పరం తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గాల్వాన్ లోయ, దెమ్‌చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. పాంగాంగ్ సరస్సు వద్ద.. చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి 2-4 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి.
కంటగింపు ఇందుకే..
గత కొన్నేళ్లలో చైనాకు దీటుగా భారత్ కూడా సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, చిన్నపాటి వైమానిక స్థావరాలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటోంది. మొత్తం మీద 3,346 కిలోమీటర్ల పొడవైన 61 సరిహద్దు రోడ్లను నిర్మిస్తోంది. దీనివల్ల ఎల్‌ఏసీ వద్దకు సులువుగా బలగాలను చేరవేయడానికి, చైనా ‘దురుసుతనానికి’ సకాలంలో అడ్డుకట్ట వేయడానికి భారత్‌కు వీలవుతోంది. ఇదే పొరుగు దేశానికి కంటగింపుగా మారినట్టు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వివాదరహిత గాల్వాన్ ప్రాంతం వద్దా చైనా మోహరింపులు చేపట్టడంపై రక్షణ నిపుణుడు కమోడోర్ సి.ఉదయ్ భాస్కర్ విస్మయం వ్యక్తంచేశారు. ‘‘గాల్వాన్‌లో జరిగింది చాలా తీవ్రమైన అంశం. సాధారణ చొరబాటు యత్నం కాదు’’ అని మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్.హూడా చెప్పారు. చైనా ఎంత యాగీ చేసినా ఎల్‌ఏసీ వెంబడి మౌలిక వసతుల అభివృద్ధిని ఆపకూడదని భారత్ గట్టిగా తీర్మానించుకుంది. సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభనకు సిద్ధమేనన్న సంకేతాన్ని పొరుగు దేశానికి పంపింది.
కొవిడ్-19 మహమ్మారి వల్ల అనేక దేశాల్లో లక్షల మంది చైనావాసులు చిక్కుకుపోయారు. అయినా భారత్‌లో ఉన్న తన పౌరులను మాత్రమే ఆగమేఘాల మీద స్వదేశానికి తరలించాలని చైనా నిర్ణయించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చని ఉదయ్ భాస్కర్ విశ్లేషించారు.
నేపాల్‌నూ ఉసిగొల్పి..