తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్రిక్తతలు తగ్గించేందుకు రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు - pangang sector

భారత్​- చైనా మధ్య మే మొదటివారంలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల సైనికాధికారుల స్థాయిలో మొదటి దఫా చర్చలు జరిగాయి. అయితే మంగళవారం ఘర్షణతో సరిహద్దుల్లో పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మేజర్ జనరల్​ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చైనా విదేశాంగ ఉప మంత్రి బీజింగ్​లో భారత రాయబారితో సమావేశమయ్యారు. భారత విధానంపై రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ త్రిదళాధిపతి, త్రివిధ దళాధిపతులతో వరుసగా భేటీ అయ్యారు.

sino india border
ఉద్రిక్తతలు తగ్గించే దిశగా.. రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు

By

Published : Jun 17, 2020, 7:35 AM IST

భారత్-చైనా సరిహద్దులో తాజా ఉద్రిక్తతలను చల్లార్చడానికి రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మేజర్‌ జనరల్‌ అధికారుల స్థాయిలో ఘటనా స్థలంలో చర్చలు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. "గాల్వాన్‌ లోయలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో సోమవారం రాత్రి ఈ హింసాత్మక ఘటన జరిగింది. పరిస్థితిని శాంతింపచేయడానికి రెండు దేశాల సీనియర్‌ మిలటరీ అధికారులు ఘటనా స్థలంలో సమావేశమయ్యారు" అని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి లువో ఝావోహుయితో మంగళవారం బీజింగ్‌లో భారత రాయబారి విక్రమ్‌ మిస్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాల్వాన్‌ పరిణామంపై చైనా తన నిరసనను తెలియజేసింది.

సమాలోచనలు..

గాల్వాన్‌ ఘటనపై మంగళవారం రాజధాని దిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితినీ తెలియజేశారు. దాదాపు గంట పాటు వీరి మధ్య భేటీ జరిగింది. అంతకుముందు రాజ్‌నాథ్‌.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. తూర్పు లద్దాఖ్‌ ఘటన నేపథ్యంలో సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె తన పఠాన్‌కోట్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి.. మరోసారి జయ్‌శంకర్‌తోను, బిపిన్‌ రావత్‌, నరవణెలతో సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్‌ సరస్సు, గాల్వాన్‌ లోయ, దెమ్‌చోక్‌, దౌలత్‌ బేగ్‌ ఓల్డీల్లో భారత సైనిక బలగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details