మే 5... భారత్-చైనా బలగాల మధ్య తొలి బాహాబాహీ జరిగిన రోజు. 70 రోజులు దాటాయి. మధ్యలో ఎన్నోసార్లు ఉద్రిక్తతలు, మాటల తూటాలు, శాంతి చర్చలు. అయినా ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. బలగాల ఉపసంహరణపై దఫదఫాలుగా చర్చలు జరుగుతున్నా... పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఫింగర్ 5 నుంచి ఇక వెనక్కి వెళ్లేందుకు చైనా దళాలు అంగీకరించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా తూర్పు లద్దాఖ్‌లోని 134 కిలోమీటర్ల పొడవైన ఉప్పు నీటి సరస్సుకు దక్షిణాన ఉన్నారు. 13,800 అడుగుల ఎత్తైన ప్రాంతంలో వారు మొహరించి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తొలి దశ చర్చల్లో...
తొలి దశ చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 5 వరకు మాత్రమే చైనా సైన్యం వెనక్కి వెళ్లింది. రెండో దశ చర్చలు జరిగినప్పటికీ అక్కడ నుంచి కదలట్లేదు. ఈ విషయంపై ఈటీవీ భారత్‌తో మాట్లాడిన ఓ అధికారి.. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి కదలమని చైనా చెప్పడం చర్చల ప్రక్రియను బలహీనపరచడమేనని భారత్ భావిస్తోంది.
జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి, ప్రాణ నష్టం సంభవించిన నేపథ్యంలో పరస్పరం విశ్వాసం ఏర్పడటానికి కొంత సమయం పడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అందువల్ల వేగంగా బలగాలను ఉపసంహరించుకోవడం కష్టమని... సైనిక స్థాయిలో మరిన్ని చర్చలు అవసరమని వివరించారు.
ఫలితం రావట్లే..!
ఈ నెల 6 నుంచి ఉన్నతస్థాయి చర్చలు జరిగినా పాంగాంగ్ అంశంపై ఎలాంటి ఆశాజనక ఫలితాలు రాలేదు. జూలై 14న(మంగళవారం) ఇరు దేశాల సైనిక కోర్ కమాండర్ల మధ్య ఏకబిగిన 15 గంటల పాటు చర్చలు జరిగాయి. ఇందులో భారత్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్(లేహ్‌లో ఉన్న 14 కార్ప్స్ కమాండర్), మేజర్ జనరల్ లిన్ లూ(జిన్జియాంగ్లోని చైనా దళానికి కమాండర్) పాల్గొన్నారు. జూన్ 6, జూన్ 22, జూన్ 30, జులై 14న ఈ భేటీలు జరిగాయి.