ప్యాంగాంగ్ సరస్సు వద్ద ప్రస్తుత పరిస్థితిపై సరిహద్దులో చర్చలు కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యానికి చెందిన బ్రిగేడ్ కమాండర్, చైనాకు చెందిన అదే స్థాయి అధికారితో సమావేశమైనట్లు స్పష్టం చేశాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చుశుల్/మోల్డో ప్రాంతంలో చర్చలు సాగుతున్నట్లు వెల్లడించాయి.
అతిక్రమణకు దీటుగా జవాబు
ప్యాంగాంగ్ దక్షిణ ఒడ్డున చైనా సైన్యం అతిక్రమణకు పాల్పడే క్రమంలో భారత జవాన్లు వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. ఆగస్టు 29-30 అర్ధరాత్రి సమయంలో లద్దాఖ్‌లోని చుశుల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయని భారత సైన్యం తెలిపింది. వీటిని దీటుగా తిప్పికొట్టినట్లు స్పష్టం చేసింది. చర్చల ద్వారా శాంతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని.. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడటం తమ కర్తవ్యమని సైన్యం ఇప్పటికే స్పష్టం చేసింది.