చైనా మాటలకు, చేతలకు పొంతన లేదని ఆధారాలతో సహా తాజాగా రుజువైంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో డ్రాగన్ 423 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో 1960లో తానే స్వయంగా పేర్కొన్న సరిహద్దు (క్లెయిమ్ లైన్)ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ నెల 25న 'ఎన్‌డీటీవీ' సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌కు చెందిన 423 మీటర్ల భూభాగంలో చైనా సైన్యం 16 గుడారాలు, టార్పాలిన్లు, ఒక భారీ షెల్టర్‌ను ఏర్పాటు చేసింది.
1960లో సరిహద్దు రేఖకు సంబంధించి తన వాదనను చైనా వినిపించింది. తన దృష్టిలో సరిహద్దు ఎలా వెళుతుందన్న దానిపై రేఖాంశ, అక్షాంశ వివరాలను అందించింది. 'రిపోర్ట్ ఆఫ్ ద గవర్న్‌మెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆన్ ద బౌండరీ క్వెశ్చన్'లో ఇవి ఉన్నాయి. నాడు రెండు పక్షాల మధ్య జరిగిన చర్చల్లో భారత అధికారులు అడిగిన ప్రశ్నలకు చైనా బృందం ఇచ్చిన సమాధానాలను అందులో పొందుపరిచారు. గల్వాన్ నది వద్ద సరిహద్దు ప్రస్తావన కూడా ఉంది. "రెండు పర్వతాల గుండా వెళుతున్న సరిహద్దు రేఖ.. పర్వత పంక్తికి దక్షిణం గుండా పయనిస్తుంది. ఆ తర్వాత అది గల్వాన్ నది వద్ద 780 13। తూర్పు రేఖాంశం, 340 46। ఉత్తర అక్షాంశం గుండా వెళుతుంది." అని చైనా పేర్కొంది.
'గూగుల్ ఎర్త్ ప్రొ'పై ఈ రేఖాంశ, అక్షాంశ వివరాలను పరిశీలించినప్పుడు చైనా చెబుతున్న రేఖ.. గల్వాన్ లోయలో ఉన్నట్లు స్పష్టమైంది. దీనికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలన్నీ భారత్‌వే. అయితే తాజా ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే స్వీయ సరిహద్దు రేఖను ఉల్లంఘించి, 423 మీటర్ల మేర భారత భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించినట్లు అర్థమవుతోంది.
1962 నాటి యుద్ధ సమయంలో చైనా బలగాలు.. గల్వాన్ ప్రాంతంలో భారత సైన్యంతో తీవ్ర పోరు తర్వాత తమ క్లెయిమ్ రేఖ వద్దకు వచ్చాయి. అనంతరం ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి వెనుదిరిగాయి. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాల బలగాలు అక్కడ పెద్దగా గస్తీ నిర్వహించలేదు.
గల్వాన్‌లో ఇప్పుడు చైనా నిర్మాణ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. దీన్నిబట్టి ఇప్పుడే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసే ఉద్దేశం ఆ దేశ సైన్యంలో ఉన్నట్లు కనిపించడంలేదు. గల్వాన్ నదిలో కల్వర్టులను నిర్మిస్తోంది.
నిఘా పెంచిన భారత నౌకా దళం