ఇకపై సైనిక అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదన్నారు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ రంగంలో స్వావలంబన అత్యంత కీలకమైన విషయమని తెలిపారు. రక్షణ పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా అన్నీ స్వదేశంలోనే తయారు చేసుకోవాలన్నారు. పలు రక్షణరంగ ప్రభుత్వ పరిశ్రమలు, ఆర్డాన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్బీ) తయారు చేసిన నూతన ఉత్పత్తులను ఆన్లైన్ కార్యక్రమంలో గురువారం ప్రారంభించారు రాజ్నాథ్. అనంతరం అత్మనిర్భర్ భారత్ సాధన ఆవశ్యకతను వివరించారు.
" అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా భద్రతే తొలి ప్రాధాన్యం. తమని తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్న దేశాలు అంతర్జాతీయంగా బలమైన దేశాలుగా గుర్తింపు తెచ్చుకుంటాయి. మన రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల ప్రభుత్వాలు, దిగుమతులు, విదేశీ రక్షణ ఉత్పత్తులపై ఆధారపడకూడదు. అది బలమైన అత్మనిర్భర్ భారత్ సాధన భావాలకు సరికాదు."
-రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి