సరిహద్దుల్లో దౌర్జన్యానికి తెగబడుతూ 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు గుణపాఠం చెప్పేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. డ్రాగన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే చైనా సంస్థలకు చెందిన 59 మొబైల్ యాప్‌లను భారత్‌లో నిషేధించిన ప్రభుత్వం.. తదుపరి హైవే నిర్మాణం, పారిశ్రామిక, టెలికాం, రైల్వే రంగాల్లోనూ చైనాను బహిష్కరించడానికి సన్నద్ధమైంది. జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలను బహిష్కరించనున్నట్లు కేంద్ర రహదారులు, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో హైవే నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలతో పాటు, ఆ దేశ సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలను (జాయింట్ వెంచర్స్) కూడా అనుమతించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ దిశగా త్వరలోనే విధాన నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిపారు.
హైవేల నిర్మాణంలో చైనా సంస్థలు ఔట్..
జాతీయ రహదారి నిర్మాణ పనులను భారత సంస్థలు చేజిక్కించుకునేందుకు వీలుగా అర్హత ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులతో పాటు కొత్త టెండర్లలోనూ చైనా సంస్థలను నిషేధిస్తామని, అవసరమైతే కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. కాగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోనూ (ఎంఎస్‌ఎంఈ) చైనా సంస్థల భాగస్వామ్యానికి స్వస్తి పలికేలా చర్యలు తీసుకోనున్నట్లు గడ్కరీ చెప్పారు. సాంకేతికత, పరిశోధన, కన్సల్టెన్సీ లాంటి రంగాల్లో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూనే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని, అయితే చైనా సంస్థల పెట్టుబడులను మాత్రం అనుమతించబోమని పేర్కొన్నారు.