జాతి, మతం, రంగు, కుల, భాష, సరిహద్దులు ఇలా వేటినీ కరోనా మహమ్మారి పట్టించుకోదని.. అందరికీ సమానంగా సోకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా భారతీయులు ఐక్యత, సోదర భావానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కరోనా వైరస్ కారణంగా వృత్తి జీవితంలో అనేక మార్పులు వచ్చాయని.. ఇల్లే కొత్త కార్యాలయంగా, ఇంటర్నెట్ ...కొత్త సమావేశ మందిరంగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు.
'ఇల్లే కార్యాలయం.. ఇంటర్నెట్ కొత్త సమావేశ మందిరం' - ఇల్లే కార్యాలయం... ఇంటర్నెట్ కొత్త సమావేశ మందిరం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు జాతి, మతం, కులం అన్న భేదాప్రాయాలు లేవన్నారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకే అందరికీ సమనంగా సోకుతుందని వ్యాఖ్యానించారు. వైరస్‌కు ప్రతి స్పందనగా ఐక్యతతో ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు.
సులభంగా అనుసరించగల జీవన శైలి, వ్యాపారాల కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు మోదీ. ప్రస్తుతం ప్రపంచం కొత్త వ్యాపార నమూనాల కోసం వెతుకుతోందన్నారు. యువకులతో నిండిన భారత్.. కొత్త పని సంస్కృతిని కల్పించడంలో ప్రపంచానికి నేతృత్వం వహించగలదని తెలిపారు. కరోనా సంక్షోభం తర్వాత సంక్లిష్టమైన ఆధునిక బహుళజాతి సరఫరా గొలుసులకు భారత్.. ప్రపంచంలోనే కేంద్ర బిందువుగా మారనుందని అన్నారు. సందర్భానికి తగ్గట్టుగా స్పందించి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.