భారత్‌లో వ్యభిచార గృహాలను మూసివేయడం ద్వారా కొత్త కొవిడ్ కేసులను 72శాతం వరకు అరికట్టవచ్చని అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. రెడ్‌లైట్ ఏరియాలను మూసి ఉంచడం వల్ల దేశంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవడానికి పట్టే సమయం 17 రోజులు ఆలస్యమవుతుందని తేలింది.
వ్యభిచార గృహాలను మూసేయడం వల్ల ముంబయిలో 12 రోజులు, దిల్లీలో 17, పుణెలో 29, నాగ్‌పుర్‌లో 30, కోల్‌కతాలో 36 రోజులు ఆలస్యంగా కేసులు గరిష్ఠానికి చేరుతాయని అంచనా వేసింది.
ఈ చర్యల ద్వారా కరోనా మరణాల సంఖ్యను సైతం గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధనలో స్పష్టమైంది. రెడ్‌లైట్ ఏరియాలను మూసేయడం వల్ల.. లాక్డౌన్ తర్వాత మరణాలు 63శాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడైంది. ముంబయిలో 28%, దిల్లీలో 38%, పుణెలో 43% మరణాలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.
రోజుకు 5 లక్షల మంది
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం దేశంలో 6,37,500 మంది వ్యభిచార వృత్తిలో ఉన్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. రోజుకు 5 లక్షల మంది వ్యభిచార గృహాలకు వెళ్తున్నట్లు వెల్లడించింది. సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వేశ్య గృహాలపై ఆంక్షలు విధించినట్లయితే భారతీయులకు కొవిడ్ సోకే ముప్పు చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఇదీ చదవండి:కరోనా కాలంలో ఆ ముచ్చట సంగతేంటి?
నిర్లక్ష్యంతో జపాన్ మూల్యం
కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పుడు జర్మనీ, నెదర్లాండ్ దేశాలు వ్యభిచార గృహాలను వెంటనే మూసేలా జాగ్రత్త వహించాయని పరిశోధకులు వివరించారు. అయితే ఈ విషయంపై జపాన్ ఆలస్యంగా తేరుకోవడం వల్ల అప్పటికే ప్రమాదం జరిగిపోయిన్నట్లు స్పష్టం చేశారు. వేశ్య గృహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్పత్రులన్నీ కొవిడ్ బాధితులతో నిండిపోయినట్లు తెలిపారు.
అందువల్ల సరైన జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా భారత్‌లో వేలాది మరణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు పరిశోధకులు. కేసులు గరిష్ఠానికి పట్టే సమయాన్ని తగ్గించడం వల్ల వైద్య వ్యవస్థపై పడే భారాన్ని అదుపు చేయవచ్చని స్పష్టం చేశారు.
భౌతిక దూరం సాధ్యం కాదు కాబట్టి..
ఈ అధ్యయన ఫలితాలను భారత ప్రభుత్వంతో పాటు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అందించినట్లు పరిశోధకులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించినా.. రెడ్‌లైట్ ప్రదేశాలను మూసే ఉంచాలని సూచించారు. ఒకవేళ వ్యభిచార గృహాలు ప్రారంభం అయితే అత్యంత వేగంగా వైరస్ విస్తరిస్తుందని, భౌతిక దూరం సాధ్యం కాదు కాబట్టి వ్యాప్తి రేటు అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ఫలితంగా రెడ్‌లైట్ ప్రాంతాలే అతిపెద్ద వైరస్ హాట్స్పాట్లుగా తయారయ్యే అవకాశం ఉందని అన్నారు.
వారినీ ఆదుకోండి
కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో వ్యభిచారులకు సరైన ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. వ్యభిచారాన్ని విడిచి ఇతర వృత్తులను చేపట్టేలా వారికి చేయూతనందించాలని పేర్కొన్నారు.