భారత్-నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించబోమని భారత్ ప్రకటించింది. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను.. నేపాల్ మంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగశాఖ స్పష్టంచేసింది.
సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలు ఉన్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
"ఈ విషయంలో భారత్ స్థానంపై నేపాల్‌కు పూర్తి అవగాహన ఉంది. అలానే భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించి, న్యాయ విరుద్ధమైన కార్టో గ్రాఫిక్ ప్రకటనను ఉపసంహరించుకోవాలని నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సరిహద్దు వివాదానికి సంబంధించి ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు నేపాల్ దేశ నాయకత్వం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాం"
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి