తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నౌకా సిబ్బందికి తక్షణ సాయం అందించండి'

చైనా ఓడరేవుల్లో చిక్కుకున్న భారతీయ రవాణా నౌకల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కొవిడ్​ నిబంధనల కారణంగా... ఆస్ట్రేలియా నుంచి బొగ్గును తీసుకెళ్లిన 22 నౌకలను ఓడరేవులో నిలిపేసింది చైనా. వీటిలో భారత్​కు చెందిన జగ్​ ఆనంద్​, అనస్తాసియా నౌకల ద్వారా మొత్తం 39 మంది సిబ్బంది చిక్కుకున్నారు. అయితే.. వీరికి తక్షణ సాయం అందించాలని చైనాను కోరింది భారత్​.

India calls for urgent, practical assistance to 39 stranded Indian sailors on 2 ships in Chinese waters
'నౌకా సిబ్బందికి తక్షణ సాయం అందించండి'

By

Published : Jan 2, 2021, 5:40 AM IST

Updated : Jan 2, 2021, 6:00 AM IST

చైనాలో చిక్కుకున్న 39 మంది భారతీయ రవాణా నౌకా సిబ్బందికి తక్షణ సాయమందించాలని భారత్​ పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనాతో ఈ విషయంపై సంప్రదించేందుకు చర్యలు చేపట్టినట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. కరోనా సంబంధిత ఆంక్షలతో చైనా అధికారులు 'ఎంవీ జగ్​ ఆనంద్'​, 'ఎంవీ అనస్తాసియా' నౌకలను అక్కడి​ ఓడరేవుల్లో నిలిపివేశారు. చైనా ప్రభుత్వం అలసత్వం కారణంగా నౌకా సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో సిబ్బందిని మార్చాలని అక్కడి అధికారులను విజ్ఞప్తి చేయగా.. దానికీ ససేమిరా అంటోంది జిన్​పింగ్​ సర్కార్​.

జింగ్​తాంగ్​ ఓడరేవులో చిక్కుకున్న 'జగ్​ ఆనంద్​' నౌకలో 23 మంది, కాఫీడియన్​ ఓడరేవులో నిలిపివేసిన 'అనస్తాసియా' నౌకలో మరో 16 మంది.. కొద్ది నెలలుగా చైనాలోనే ఉండిపోయారు. అయితే.. సంబంధిత షిప్పింగ్​ కంపెనీల సాయంతో చైనాలోని భారత దౌత్య కార్యాలయం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి నౌకా సిబ్బందికి తక్షణమే ఆచరణయోగ్యమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన పేర్కొన్నారు.

ఎన్​హెచ్​ఆర్సీ ఏమందంటే?

ఈ విషయమై షిప్పింగ్​ డైరెక్టర్​ జనరల్​కు జాతీయ మానవ హక్కుల కమిషన్​(ఎన్​హెచ్​ఆర్సీ) నోటీసులు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 146 రోజులపాటు చైనా ఓడరేవులో చిక్కుకున్న భారతీయ నౌకా సిబ్బంది పరిస్థితులపై.. ఎన్​హెచ్​ఆర్సీ స్వయంగా ఆరాతీసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

చైనా, ఆస్ట్రేలియా మధ్య విభేదాల కారణంగా.. ఆసీస్​ నుంచి సరకు తీసుకెళ్లిన భారతీయ నౌకా సిబ్బంది గతేడాది జూన్​ నుంచి అక్కడే ఉండిపోయారంది. చైనా తీరుపై మండిపడిన ఎన్​హెచ్​ఆర్సీ.. ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

ఆస్ట్రేలియా నుంచి జగ్‌ ఆనంద్‌ సహా.. మొత్తం 22 నౌకలు బొగ్గును తీసుకుని చైనాకు బయల్దేరాయి. ఈ ఓడల్లో మొత్తం 400కు పైగా మంది సిబ్బంది ఉన్నారు. వాణిజ్యపరమైన విభేదాల కారణంగా ఉభయ దేశాల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:ఆసీస్​ జాతీయ గీతంలో మార్పు- కారణమిదే...

Last Updated : Jan 2, 2021, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details