భారత్ ఆహ్వానం మేరకు గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సొనారో ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజ్‌పథ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని వేడుకలను తిలకించారు. ఇలా భారత గణతంత్ర దినోత్సవానికి హాజరైన మూడో బ్రెజిల్ అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచారు బోల్సొనారో.
నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు బోల్సొనారో. ఆయనతో పాటు 8 మంది కేబినెట్ మంత్రులు, నలుగురు బ్రెజిల్ ఎంపీలు వచ్చారు. జనవరి 25న భారత్‌తో ప్రతినిధుల స్థాయి చర్చల్లోనూ పాల్గొన్నారు.
అయితే.. బోల్సొనారో సంప్రదాయవాదిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనపై మహిళ, స్వలింగ సంపర్కుల వ్యతిరేకిగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల భారత్ పర్యటనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదాలతోనే అధికారంలోకి..
మాజీ సైనికాధికారి అయిన బోల్సొనారో.. 2018 వరకు బ్రెజిల్ రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపలేదు. అయితే హౌస్ ఆఫ్ డిప్యూటీస్‌కు వరుసగా 7 సార్లు ఎన్నికయ్యారు. మాజీ అధ్యక్షుడు లులా దిగిపోయిన నేపథ్యంలో బోల్సొనారో అగ్రపీఠానికి చేరుకునేందుకు మార్గం సుగమం అయింది. వ్యక్తిగత సామర్థ్యం లేకపోయినప్పటికీ.. వివాదాస్పదమైన ఆయన భావజాలం ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రెజిల్‌కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించింది.
బ్రెజిలే ఎందుకు?
బ్రెజిల్ కన్నా పెద్దవి.. స్నేహపూర్వక దేశాలు ఎన్నో భారత్‌కు ఉన్నాయి. వాటిని కాదని బ్రెజిల్‌ను ఆహ్వానించటం ఎందుకనే ప్రశ్న తలెత్తడం సహజం. ఇందుకు కారణాలు కనుక్కోవటం పెద్ద కష్టమేమీ కాదు. రాజకీయంగా భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు ఉన్న కొద్ది దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఈ మేరకు 2006లో రెండు దేశాలమధ్య ఒప్పందం జరిగింది.
ముఖ్యమైన మిత్రదేశం
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా), ఐబీఎస్ఏ(భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా), జీ-20 దేశాల్లో మనతోపాటు బ్రెజిల్ సభ్య దేశంగా ఉంది. జీ-4(బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్) సమూహంలో సభ్యులుగా ఉన్న రెండు దేశాలు... ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి పరస్పరం సహకారాన్ని అందించుకుంటున్నాయి. అంతేకాదు.. ఐరాసలో ఉగ్రవాదం, శాంతి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్‌కు ప్రతిసారి మద్దతునిచ్చింది బ్రెజిల్.
సారూప్యతలు.. సహకారం..
వాణిజ్యపరంగానూ రెండు దేశాల మధ్య సారూప్యతలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న భారత్, బ్రెజిల్.. 2010లో దాదాపు సమాన జీడీపీని సాధించాయి. ఆ తర్వాత బ్రెజిల్ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోగా, భారత్‌లో ఇప్పుడిప్పుడే ఆ సూచనలు కనిపిస్తున్నాయి.
పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పటికీ బ్రెజిల్ భారత్‌కు ప్రధాన భాగస్వామ్య దేశమే. ఎందుకంటే ప్రపంచంలో ఇనుము నిక్షేపాలు, హైబ్రిడ్ శక్తిని ఉత్పత్తి చేసే ఇథనాల్.. బ్రెజిల్‌లోనే అత్యధికంగా లభిస్తాయి. ముడిచమురు తీసుకున్నా.. బ్రెజిల్లో సుమారు 8,200 కోట్ల బ్యారెళ్ల నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉద్ధృతమైతే.. చమురు సంక్షోభం నుంచి బ్రెజిల్ మనకు ఊరట కల్పిస్తుంది. ఈ విషయమై ఇప్పటికే రెండు దేశాల సహకార ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాకుండా బ్రెజిల్ కీలక సభ్యదేశంగా ఉన్న మెర్కోసర్ కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేసింది.
వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల్లోనూ..
వీటితోపాటు చక్కెర, కాఫీ, సోయా ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉంది బ్రెజిల్. ప్రపంచంలోని అడవుల్లో 20 శాతానికి పైగా అమెజాన్ అటవీ ప్రాంతమే ఆక్రమించింది. అమెజాన్ పూర్తిగా జీవవైవిధ్యం, ఔషధ మొక్కలకు నెలవు. తయారీరంగ పరిశ్రమల్లో బ్రెజిల్ ప్రయత్నాలు మనం పాఠాలు నేర్చుకోవచ్చు.. వారి నుంచి సహకారం పొందవచ్చు.
1896లో భారత్‌లోని గిర్ నుంచి 700 ఆవులను బ్రెజిల్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం మాంసంతోపాటు పాల ఉత్పత్తుల్లో ఆ దేశం మొదటిస్థానంలో ఉంది.
సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే.. పేద ప్రజలను అభివృద్ధి కోసం బ్రెజిల్ చేపట్టిన కార్యక్రమం గురించి చెప్పుకోవాలి. బోల్సా ఫమిలియా(కుటుంబ ప్యాకేజీ) పథకంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రతినెల ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ డబ్బు కుటుంబంలో మహిళ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, పిల్లలు పాఠశాలకు వెళుతున్నట్లు వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
భారత్ కూడా ఈ పద్ధతిని పాక్షికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇలా పరస్పర అభివృద్ధిని కాంక్షించటం ద్వారా సన్నిహిత దేశాలుగా ఉన్నాయి.
15 ఒప్పందాలు..
ప్రస్తుత పర్యటనలో రెండు దేశాల మధ్య వివిధ రంగాలకు సంబంధించి 15 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇందులో పరిశ్రమలు, పౌర విమానయానం, ఆరోగ్యం, సంప్రదాయ ఔషధాలు, వ్యవసాయం, విద్యుత్, గనులు, ఆవిష్కరణలు, పశు సంరక్షణకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ అవకాశాలతో భారత ఆర్థిక వ్యవస్థకు మరింత తోడ్పడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
(రచయిత- జేకే త్రిపాఠి)
ఇదీ చూడండి: పాక్ వద్ద పది.. భారత్ వద్ద నాలుగే..!