భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేడు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ప్రధానంగా రవాణా, సమాచార వ్యవస్థ, సామర్థ్యం పెంపు, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఆరు నుంచి ఏడు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
ఇరుదేశాల నేతలు మూడు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. కానీ ప్రాజెక్టులపై పూర్తి వివరాలు వెల్లడించలేదు.
" భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు ఆశించిన విధంగా లేవు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపైనే చర్చ ఉండనుంది. ఇందులో ప్రధానంగా వాణిజ్యం, సమాచార రంగంపై చర్చిస్తారు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరు దేశాలు ప్రత్యేక పథంలో తీసుకోబోయే తదుపరి చర్యల గురించే చెబుతున్నాం. వాణిజ్యం, సమాచార వ్యవస్థలో సహకారం, ప్రజల మధ్య సంబంధాలు, సంస్కృతి వంటి ఇతర సమస్యల పరిష్కారంపై చర్చ చేపట్టనున్నారు. "