కరోనా సంక్షోభ సమయంలోనూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్థాన్. ఒకవైపు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచం ప్రయత్నిస్తుంటే.. పాక్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. శుక్రవారం జమ్ముకశ్మీర్ కుప్వాడా జిల్లా కేరన్ సెక్టార్లో పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది భారత సైన్యం.
పొరుగు దేశంలోని సైనిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు చేసింది. అయితే ఈ దాడుల కారణంగా పాక్ సైన్యానికి భారీ నష్టం జరిగిందని వెల్లడించారు సైనికాధికారులు.
"కుప్వాడా జిల్లా కేరన్ సెక్టార్లో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థమంతంగా ఎదుర్కొంది. ప్రతీకారం తీర్చుకుంది. శత్రువుల వైపు భారీ నష్టం వాటిల్లినట్లు మా వద్ద సమాచారం ఉంది.
- భారత రక్షణ ప్రతినిధి