తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతా మండలిలో 'శాశ్వత' హోదాయే లక్ష్యం - ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తేచ్చేందుకు భారత్​ ప్రయత్నం

భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తోన్న భారత్‌... మరోసారి ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తేచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 21న ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఇందుకు వేదికగా చేసుకుంటోంది.

భద్రతా మండలిలో 'శాశ్వత' హోదాయే లక్ష్యం

By

Published : Sep 23, 2019, 7:00 AM IST

Updated : Oct 1, 2019, 3:58 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడేళ్ల తర్వాత న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్‌జీఏ) పాల్గొననున్నారు. 2015 లో 70వ ఐరాస సదస్సు వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆ భేటీలో అజెండా 2030పై ప్రపంచనేతలు చర్చించారు. 2030 నాటికి చేరుకోవాల్సిన 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై (ఎస్​.డి.జి) సమాలోచనలు జరిపారు. అయితే ఈ నాలుగేళ్లలో ప్రపంచంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

అజెండా 2030...

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటి మేలు కలయిక అజెండా 2030. భారతదేశ అభివృద్ధి అజెండా ఇందులో ప్రతిబింబిస్తుందని మోదీ ఆనాడు అన్నారు.

అజెండా 2030లో నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడానికి సమర్థవంతమైన అంతర్జాతీయ సహకారం అవసరం. ఈ సెప్టెంబర్ 23-24 మధ్య న్యూయార్క్‌లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నారు. అజెండా 2030ను అమలు చేయడంలో భారత్​ చూపించిన చొరవను తెలియజేయనున్నారు.

అజెండా 2030తో పాటు.. క్లైమెట్‌ యాక్షన్‌ సదస్సు, యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ పై ఉన్నత స్థాయి సమావేశం, స్థిర అభివృద్ధి లక్ష్యాలపై సదస్సు జరగనుంది. మహాత్ముడి 150వ జయంత్యోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్‌ 24న జరగనున్న కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు.

యోగా దినోత్సవం...

2014లో ఎస్‌డీజీల గురించి చర్చలు జరిపిన తరువాత.. "ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సమగ్రమైన విధానాన్ని" రూపొందించడానికి యూఎన్​జీఏ జూన్ 21ని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా జరపాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు.

ఈ పిలుపునకు యూఎన్‌జీఏ నుంచి విశేష స్పందన వచ్చింది. 75 రోజుల్లో 177 దేశాలు ఈ ప్రతిపాదనను మద్దతు ప్రకటించాయి.

స్థిర అభివృద్ధి లక్ష్యాలు-ఎస్​డీజీ-7లో భాగంగా.. భారతదేశం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఇందులో.. 80 గిగావాట్లను ఈ ఏడాదిలోనే సాధించింది. భారత్‌ సాధించిన ఈ విజయాన్ని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రశంసించింది.

ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం పైకప్పు కోసం 193 సౌర ఫలకాలను భారత్‌ అందించింది. ఈ పైకప్పును ప్రధాని ప్రారంభించనున్నారు. 2018 ఫిబ్రవరిలో భారత్‌ ప్రవేశపెట్టిన 'ఆయుష్మాన్‌ భారత్​' కార్యక్రమం ద్వారా 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. స్థిర అభివృద్ధి లక్ష్యాలు-3లో భాగంగా ఆరోగ్యం, ఆనందంపై నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో భారత్‌ ప్రధానపాత్ర పోషించింది.

పారిశుద్ధ్యంపై ఎస్​డీజీ-6లో భాగంగా బహిరంగ మల విసర్జనను నిరోధించడంలో భారత్​ గణనీయమైన కృషి చేసింది. 'స్వచ్ఛ భారత్'​ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి స్వాగతించింది. అజెండా 2030పై మాట్లాడుతూ ప్రపంచనేతలు " సుస్థిర అభివృద్ధి లేకుండా శాంతి లేదు, శాంతి లేకుండా.. సుస్థిర అభివృద్ధి లేదు" అని స్పష్టం చేశారు.

సంఖ్య పెంచాలి...

భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదనను 2005లోనే ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. అంతర్జాతీయ వ్యవహారాలలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలు భారత్‌కు చాలా ప్రధానం.

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత చైనా సహకారంతో.. భారత్‌పై ఒత్తిడి తేవడానికి పాకిస్థాన్‌ ప్రయత్నించింది. శాశ్వత సభ్యదేశమైన చైనా అభ్యర్థన మేరకు అనధికార సమావేశంలో భద్రతా మండలి చర్చించింది. దౌత్యపరంగా భారత్‌ విజయం సాధించినప్పటికీ.. 50 ఏళ్ల తర్వాత ఇలా అనధికార సమావేశంలో కశ్మీర్‌ అంశం మరోసారి ఐక్యరాజ్య సమితిలో చర్చకు వచ్చింది.

ఇండో- పసిఫిక్​ ప్రాంతంలో శాంతి...

యెమెన్‌, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌ సహా పశ్చిమ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి స్థిరత్వంపై భద్రతా మండలి తీసుకోనున్న నిర్ణయాల్లో భారత్‌ భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. దేశ వాణిజ్యం, ఇంధన సరఫరా సహా.. డిజిటల్‌ ఇండియా కోసం గ్లోబల్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ కనెక్టివిటీతో పాటు ఈ ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత భారత్‌కు కీలకం. ఈ ప్రాంతాల్లో నివసిస్తోన్న 80 లక్షల మంది భారతీయులు ఏటా 40 బిలియన్‌ డాలర్లు స్వదేశానికి పంపిస్తున్నారు.

ఏకపక్ష నిర్ణయాలు...

భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలు తమ ఏకపక్ష చర్యలతో ఐరాస సభ్యదేశాల సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతామండలి సంస్కరణలు కోరుకుంటున్న ఇతర దేశాలతో కలిసి అంతర్జాతీయ నాయకత్వాన్ని అందించడం భారత్‌కు పరీక్షే. 2019 జూన్‌14న భద్రతా మండలి సంస్కరణలపై ఓ తీర్మానం ఆమోదం పొందింది. 2020 సెప్టెంబర్​ 21న జరగబోయే ఐరాస 75వ వార్షికోత్సవ సదస్సులో ఈ తీర్మానంపై కార్యాచరణ ప్రకటించాల్సి ఉంది.

అజెండా 2030తో పాటు.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా, భద్రతా సంస్కరణలు, శాంతి స్థాపన, స్థిరాభివృద్ధిలో సహకారంపై సెప్టెంబర్​ 27న ప్రధాని ప్రసంగించనున్నారు.

- అశోక్​ ముఖర్జీ, మాజీ దౌత్యవేత్త

Last Updated : Oct 1, 2019, 3:58 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details