భారత్ ఎప్పుడూ వాస్తవాధీన రేఖను అతిక్రమించలేదని.. చైనా కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని తాము ఆశిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దు పరిస్థితులను మార్చేందుకు చైనా ఎలాంటి ఏకపక్ష ధోరణి ప్రదర్శించినా సహించేది లేదని తేల్చిచెప్పింది.
తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ విషయంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. మీడియాతో మాట్లాడుతూ... సరిహద్దు ఘర్షణ జరిగిన తరువాత భారత సైనికులు ఎవ్వరూ చైనాకు బందీలుగా చిక్కలేదని స్పష్టం చేశారు.
చర్చలు జరుగుతున్నాయి..
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న శ్రీవాస్తవ.. గల్వాన్ లోయ వద్ద చెలరేగిన ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు భారత్-చైనాలు మేజర్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుపుతున్నాయని వెల్లడించారు. అలాగే ఇరుదేశాల రాయబార కార్యాలయాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ బోర్డర్ అఫైర్స్ (డబ్లూఎంసీసీ) లాంటి దౌత్య యంత్రాంగాల ద్వారా కూడా చర్చలు జరుపుతున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు.